Sathupalli: కుమారుడి పుట్టినరోజున 152 మంది విద్యార్థులకు చికెన్ విందు
Sathupalli: సత్తుపల్లిలో కుమారుడి పుట్టినరోజు, బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చికెన్ విందు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు దంపతులు.
Sathupalli: కుమారుడి పుట్టినరోజున 152 మంది విద్యార్థులకు చికెన్ విందు
సత్తుపల్లి: పుట్టినరోజు వేడుకలంటే కేక్ కటింగ్‌లు, కొత్త దుస్తులు, ఆడంబరాలు, హంగామాలు గుర్తుకొస్తాయి. కానీ అందుకు భిన్నంగా ఆలోచించిన ఓ తల్లిదండ్రులు తమ కుమారుడి పుట్టినరోజును పదిమందికి ఆనందాన్ని పంచే వేడుకగా మార్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.
సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS)లో ఐదో తరగతి చదువుతున్న యనమాల హేమచంద్ పుట్టినరోజు, అదే రోజు బాలల దినోత్సవం కావడంతో అతని తల్లిదండ్రులు విజయ్, సంపూర్ణ దంపతులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
తమ కుమారుడి పుట్టినరోజును ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే కాకుండా, తాను చదువుకుంటున్న పాఠశాలలో తనతో పాటు విద్యనభ్యసిస్తున్న తోటి విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాఠశాలలోని 152 మంది విద్యార్థులకు చికెన్ విందు ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు చేసే ఖర్చుతో కేవలం తమ కుటుంబానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ సంతోషాన్ని పంచడం అభినందనీయమని పలువురు కొనియాడారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ, పుట్టినరోజు వేడుకలకు ఓ సామాజిక బాధ్యతను జోడించిన విజయ్, సంపూర్ణ దంపతుల ఆలోచన పలువురికి స్ఫూర్తిగా నిలిచింది.
ఈ సందర్భంగా సత్తుపల్లి ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు లాల్ అహ్మద్, పీ. నరసింహా, లావణ్య, లక్ష్మీ, అనూషలు విద్యార్ధి పేరెంట్స్ అయిన యనమాల విజయ్, సంపూర్ణ దంపతులను అభినందించారు. విద్యార్థులు సైతం తమకు విందు ఏర్పాటు చేసిన హేమచంద్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
వేడుకలు చేసుకోవడంలోనే కాదు.. ఆ వేడుకల్లో నలుగురి ఆనందాన్ని చూడటంలోనే అసలైన సంతోషం ఉందని చాటిచెప్పిన ఈ కుటుంబం నిజంగా అభినందనీయం.




