Sathupalli: అర్ధరాత్రి పునరావాస కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
Sathupalli: అర్ధరాత్రి 1 గంటకు పునరావాస కేంద్రానికి చేరుకుని వరద బాధితులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి. దుస్తులు పంపిణీ చేసి ధైర్యం చెప్పిన నేత.
Sathupalli: అర్ధరాత్రి పునరావాస కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి: వరద ముంపుతో సర్వస్వం కోల్పోయి పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధిత కుటుంబాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అండగా నిలిచారు. అర్ధరాత్రి సమయం అయినప్పటికీ బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు రాత్రి ఒంటిగంట సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు.
వేశ్యకాంతల చెరువు పొంగిపొర్లడంతో ఆయకట్టు పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా కుటుంబాలను సురక్షితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు అవసరమైన దుస్తులను పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా బాధితుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భోజనాన్ని స్వయంగా వడ్డించి వారి ఆకలి తీర్చారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమైన నిత్యావసరాలు, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా.. అర్ధరాత్రి అయినా పునరావాస కేంద్రానికి చేరుకుని బాధితుల అవసరాలను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే చర్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.




