Sathupalli: యూపీఐ డిజిటల్ చెల్లింపుల చార్జీలపై కేంద్రం పునరాలోచించాలి

Sathupalli: సత్తుపల్లిలో సీపీఐ(ఎం) మండల ముఖ్య కార్యకర్తల సమావేశం. యూపీఐ డిజిటల్ చెల్లింపుల చార్జీలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 24 Sept 2026 8:07 PM IST
Sathupalli
X

Sathupalli: యూపీఐ డిజిటల్ చెల్లింపుల చార్జీలపై కేంద్రం పునరాలోచించాలి

సత్తుపల్లి: యూపీఐ డిజిటల్ చెల్లింపులపై చార్జీల పేరుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో బండి వేలాద్రి అధ్యక్షతన జరిగిన పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ అవసరాలకు కోట్లాది మంది ప్రజలు యూపీఐ సేవలను వినియోగిస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు. నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా మారిన ఈ సేవలపై కూలీలు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఈ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించినా, ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారులు, చిన్న వ్యాపారులపైనే పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఒకవైపు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని చెబుతూనే, మరోవైపు చార్జీల విధానాలను తీసుకురావడం వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మండిపడ్డారు. మొదట ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత విపరీతంగా చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. యూపీఐ చార్జీల వల్ల సామాన్యులకు నష్టం లేదనడం ప్రజలను మభ్యపెట్టడమేనని, ఏ వ్యాపారీ తన లాభాలను వదులుకోకుండా వస్తువుల ధరలు పెంచి వినియోగదారులపైనే ఆ భారాన్ని వేస్తారని హెచ్చరించారు.

ఇప్పటికే జీఎస్టీ రూపంలో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ వర్గాల రుణాలను మాఫీ చేస్తూ వారికి కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు సేవా రంగాన్ని అప్పగించి ప్రజలను దోచుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, నాయకులు కువ్వారపు లక్ష్మణరావు, తడికమళ్ల రామకృష్ణ, కావూరి వెంకటేశ్వరరావు, ఎలగం రాములు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI