Khammam: సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం!

Khammam: సత్తుపల్లిలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై దిశానిర్దేశం.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 7 Oct 2026 2:32 PM IST
Khammam
X

Khammam: సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం!

Khammam: రానున్న ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధమవుతూ సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు నమోదు జరిగేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో చురుగ్గా పనిచేయాలని సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వైద్యులు, ఇతర అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి, వారిని కలిసి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు పూర్తయ్యే వరకు ప్రత్యేక దృష్టి సారించి ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన ఓటర్లు దసరా సెలవుల సందర్భంగా స్వగ్రామాలకు వచ్చే అవకాశం ఉన్నందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి ఓటు నమోదు జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సండ్ర వెంకట వీరయ్య విమర్శలు చేశారు. ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సండ్ర పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును గుర్తించి ఓటు నమోదు చేయించేలా క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI