Bhadrachalam: ప్రైవేట్ లాడ్జిల్లో ఏం జరుగుతోంది..? భద్రత కరువైందా..!

Bhadrachalam: భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రైవేట్ లాడ్జిల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు మరియు ఏజెన్సీ చట్టాల ఉల్లంఘనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 18 Nov 2026 8:32 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: ప్రైవేట్ లాడ్జిల్లో ఏం జరుగుతోంది..? భద్రత కరువైందా..!

Bhadrachalam: భక్తుల కొంగుబంగారమైన భద్రాచలం.. సీతారామచంద్రస్వామి కొలువైన పుణ్యక్షేత్రం.. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చే పవిత్ర ప్రాంతం.. అలాంటి రాములవారి సన్నిధిలో ప్రైవేట్ లాడ్జిల నిర్వహణపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తులకు భరోసా ఇవ్వాల్సిన లాడ్జిలే భయాందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయా..?

ప్రైవేట్ లాడ్జిల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ లాడ్జిలో చోటుచేసుకున్న ఘటనతో ఈ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

గత ఏడాది కాలంలో ప్రైవేట్ లాడ్జిలకు సంబంధించిన ఘటనల్లో సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మరణాల వెనుక ఉన్న కారణాలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న తెరపైకి వస్తోంది.

భద్రాచలం ఏజెన్సీ ప్రాంత పరిధిలో ఉండగా.. ఏజెన్సీ చట్టాలు, భవన నిర్మాణ నిబంధనలను పక్కనపెట్టి భారీ భవనాలు, ప్రైవేట్ లాడ్జిలు, రెసిడెన్సీలు ఎలా వెలుస్తున్నాయి?

ఈ భవనాలకు నిర్మాణ అనుమతులు ఉన్నాయా..? లాడ్జిల నిర్వహణకు అవసరమైన రెసిడెన్సీ అనుమతులు ఎవరు ఇచ్చారు..? ఏ నిబంధనల ఆధారంగా అనుమతులు మంజూరు చేశారు..? అనుమతులు లేకుండానే నిర్వహిస్తుంటే సంబంధిత అధికారులు ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు..?

ఇవన్నీ ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.

నిన్నటి ఘటన నేపథ్యంలో కుల సంఘాల నాయకులు ఆందోళనకు దిగడంతో అధికారులు హుటాహుటిన స్పందించి సంబంధిత లాడ్జిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క లాడ్జిపైనే చర్యలు తీసుకుంటే సరిపోతుందా..? పట్టణంలో ఉన్న మిగిలిన లాడ్జిల సంగతేంటి..?

భద్రాచలంలో ఉన్న సుమారు 200 ప్రైవేట్ లాడ్జిలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి లాడ్జి నిర్మాణ అనుమతులు, నిర్వహణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లాడ్జిలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

భక్తుల ప్రాణాలకు భరోసా ఎవరు..?

రాములవారి దర్శనం కోసం భద్రాచలం వచ్చే భక్తులు భయపడే పరిస్థితి రాకూడదంటే అధికారుల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలి. ఒక సంఘటన జరిగినప్పుడు హడావుడిగా స్పందించడం కాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, పంచాయతీ అధికారులు, సంబంధిత రెవెన్యూ శాఖలు సమన్వయంతో భద్రాచలంలోని అన్ని ప్రైవేట్ లాడ్జిలపై ప్రత్యేక తనిఖీలు చేపడతారా..?

ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారా..? లేక మరో విషాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూస్తారా..? భక్తుల భద్రత కోసం ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem