Kothagudem: రద్దు చేసిన హైదరాబాద్ బస్సులను పునరుద్ధరించాలి: సీపీఎం!
Kothagudem: కొత్తగూడెం టూ హైదరాబాద్ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి బస్టాండ్ ఎదుట సీపీఎం మహాధర్నా, డీఎంకు వినతిపత్రం, నిధులపై ప్రశ్నించిన నేత ఏజే రమేష్.
Kothagudem: రద్దు చేసిన హైదరాబాద్ బస్సులను పునరుద్ధరించాలి: సీపీఎం!
కొత్తగూడెం: కొత్తగూడెం డిపో నుండి హైదరాబాద్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ బస్సులను రద్దు చేశారని రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్ డిమాండ్ చేశారు.
రద్దు చేసిన బస్ సర్వీస్ లను పునరుద్ధరించాలని సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏజీ రమేష్ మాట్లాడుతూ గత 20 రోజుల నుండి కొత్తగూడెం నుండి హైదరాబాదుకు వెళ్లాల్సిన నాలుగు సూపర్ లగ్జరీ బస్సులు రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులను రద్దు చేశారని దీనివలన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మణుగూరు భద్రాచలం నుండి వచ్చే బస్సులపై ఆధారపడి హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే ఖమ్మం వెళ్లి ఖమ్మం నుండి హైదరాబాదుకి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గొప్పలు చెప్పుకుంటూ అసలు మహిళలు ఎక్కడానికి వీలు లేకుండా ఉచిత బస్ సర్వీస్ లను రద్దు చేసిందని విమర్శించారు.
హైదరాబాద్ కి అవసరాల రీత్యా వెళ్లాలనుకునే పేద మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని చేసిందని ఆరోపించారు. ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరి పై పెచ్చులు ఊడి పడుతున్నాయని వర్షాకాలం వస్తే బస్టాండ్ ఆవరణమంతా చిత్తడి చిత్తడి అవుతుందని ఇదే విషయమై పలుమార్లు అధికారులను కలిసిన పైపై మరమ్మతులు చేసి వదిలేసారే తప్ప నూతన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
బస్టాండ్ లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రయాణికుల రద్దీ పెరిగిందని ప్రయాణికుల సంఖ్య కనుగొనంగా బస్సు సర్వీసులను పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం నుండి వారికి ఆదాయం రావట్లేదని అందుకే బస్సు సర్వీసులు రద్దు చేశామని చెప్పడం ప్రజల సౌకర్యాన్ని సంక్షేమాన్ని గాలికి వదిలేయడమేనని విమర్శించారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా కొత్తగూడెం నుండి హైదరాబాద్ బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని మహిళలకు కేటాయించిన ఉచిత బస్ సర్వీస్ లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బస్టాండ్ అభివృద్ధికి పద్నాలుగు కోట్లు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారని ప్రకటించిన నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులు కాగితాల మీద కనబడుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
డిపో మేనేజర్ కి వినతి
అనంతరం డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం మాట్లాడుతూ ఆదాయం లేక సర్వీసులు తీసేసామని చెప్పగా ప్రజల సౌకర్యం కంటే ఆదాయమే ముఖ్యమా అని సిపిఎం నాయకత్వం ప్రశ్నించింది.పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ లక్ష్మి నాయకులు కాళంగి హరికృష్ణ, లింగయ్య, జలాల్,బాలకృష్ణ, రాములు,రఘు, నసూర్, శారద తదితరులు పాల్గొన్నారు.




