Kothagudem: నెలన్నరలోగా రీ-సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్!
Kothagudem: రామవరంలో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్. 1,950 ఎకరాల సర్వేను నెలన్నరలోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం.
Kothagudem: నెలన్నరలోగా రీ-సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్‌పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామవరం రెవెన్యూ పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు అటవీ భూముల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు వివరించారు.
సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యంగా సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసి ఉన్నందున రికార్డుల ఆధారంగా ఆయా భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.
పోడు సాగు భూములకు సంబంధించి అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. రీ-సర్వే అనంతరం భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
సమ్మక్క గద్దె సమీప ప్రాంతం నుంచి సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు వివరించారు. పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు.
రీ-సర్వే పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




