Bhadrachalam: గర్భిణి భార్యను చంపి గోదాట్లో పడేసిన AR కానిస్టేబుల్!

Bhadrachalam: నాలుగు నెలల గర్భిణి అయిన భార్య భవానిని హతమార్చి గోనెసంచిలో కట్టి గోదావరిలో పడేసిన కొత్తగూడెం ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 7 Nov 2026 3:12 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గర్భిణి భార్యను చంపి గోదాట్లో పడేసిన AR కానిస్టేబుల్!

భద్రాచలం: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించాడు.. కానీ అనుమానాలు, కుటుంబ కలహాలు చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, నాలుగు నెలల గర్భవతిగా ఉన్న ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి గోదావరి నదిలో పడేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేందర్‌కు, భవానితో రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం వీరికి మగబిడ్డ జన్మించగా, పుట్టిన రెండు నెలలకే ఆ శిశువు మృతి చెందింది. ప్రస్తుతం భవాని నాలుగు నెలల గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భర్త వేధింపులపై గతంలోనే భవాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నరేందర్ తన భార్య భవానిని హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి, తన తండ్రి సహాయంతో ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం నుంచి భద్రాచలం తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గురువారం అర్ధరాత్రి భద్రాచలం గోదావరి వంతెన వద్దకు చేరుకుని 25వ పిల్లర్ సమీపంలో మృతదేహాన్ని నదిలో పడేసినట్లు తెలుస్తోంది.

అనంతరం నిందితుడు కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భద్రాచలం చేరుకుని గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో శుక్రవారం ఉదయం బూర్గంపాడు సమీపంలో భవాని మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రేమించి పెళ్లాడిన భార్యనే హత్య చేయడం.. అందులోనూ ఆమె నాలుగు నెలల గర్భవతిగా ఉండటం ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. గతంలోనే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినప్పటికీ ఈ దారుణం జరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. భార్యను హత్య చేయడానికి గల అసలు కారణాలు ఏమిటి? ఈ ఘటనలో తండ్రి పాత్ర ఎంతవరకు ఉంది? గతంలో భవాని చేసిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉంది. ఒకవైపు భార్య ప్రాణం.. మరోవైపు పుట్టకముందే బిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem