Kothagudem: ఎల్ నినో ప్రభావంతో 61.34% పెరిగిన విద్యుత్ డిమాండ్: ఎస్‌ఈ మహేందర్

Kothagudem: ఎల్ నినో ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ డిమాండ్ 61.34% పెరిగిందని, నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టామని ఎస్‌ఈ మహేందర్ తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 Oct 2026 3:35 PM IST
Kothagudem
X

Kothagudem: ఎల్ నినో ప్రభావంతో 61.34% పెరిగిన విద్యుత్ డిమాండ్: ఎస్‌ఈ మహేందర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నామని TGNPDCL భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ) గొట్టిముక్కల మహేందర్ తెలిపారు. హెచ్‌ఎంటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విద్యుత్ శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులు, రానున్న వేసవిని ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణను వివరించారు.

*61.34 శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్*

జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 3,58,799, వాణిజ్య కనెక్షన్లు 44,889, పారిశ్రామిక కనెక్షన్లు 1,659, వ్యవసాయ కనెక్షన్లు 63,519 కలిపి మొత్తం 4,79,871 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని మహేందర్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో రోజుకు సుమారు 3 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా, ప్రస్తుతం 5.31 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నారు. రోజుకు అదనంగా 2.31 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోందని, డిమాండ్ సుమారు 61.34 శాతం పెరిగిందని వివరించారు.

*విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం*

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలో ఎనిమిది కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 22 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ఆదేశాలకు అనుగుణంగా గత రెండున్నరేళ్లలో 72 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 35 సబ్‌స్టేషన్లలో ప్రత్యామ్నాయ ఫీడర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, 151 కిలోమీటర్ల మేర కొత్త 33 కేవీ విద్యుత్ లైన్లను నిర్మించామని వెల్లడించారు.

33 కేవీ లైన్లు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను వేగంగా గుర్తించేందుకు 296 ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా ఏ ప్రాంతంలో లోపం ఏర్పడిందో తక్కువ సమయంలో గుర్తించి, సిబ్బంది త్వరగా స్పందించి సరఫరాను పునరుద్ధరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

*లో వోల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు*

గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి మండలాల్లో ఎనిమిది లో వోల్టేజీ పాయింట్లను గుర్తించి, అక్కడ ఎనిమిది వోల్టేజ్ బూస్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా 102 రెండు ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వీటి ద్వారా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపడి, విద్యుత్ వ్యవస్థపై లోడ్ తగ్గడంతోపాటు నాణ్యమైన సరఫరాకు దోహదపడుతుందని వివరించారు.

*వచ్చే వేసవికి ప్రత్యేక కార్యాచరణ*

గత ఏడాది కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట పట్టణాల్లో 680 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని మహేందర్ తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మరో 600 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 105 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పూర్తిచేశామని వెల్లడించారు.

*రైతులకు ఎస్‌ఈ సూచనలు*

గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు శాఖ కృషి చేస్తోందన్నారు. రైతులు తమ వ్యవసాయ పంపుసెట్ల వద్ద 2 కేవీఏఆర్ కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మోటార్ సామర్థ్యాన్ని పెంచినప్పుడు సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని, అవసరాన్ని బట్టి ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించాలని, అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాలని సూచించారు. వ్యవసాయదారులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను కాపాడుకోవడంతోపాటు విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించాలని ఎస్‌ఈ మహేందర్ విజ్ఞప్తి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM