Kothagudem: పోలీసు అమరుల త్యాగం మరువలేనిది: డాక్టర్ గడల
Kothagudem: పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తి అని జనసేన నేత, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Kothagudem: పోలీసు అమరుల త్యాగం మరువలేనిది: డాక్టర్ గడల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు మరువలేనివని జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు.
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి వెళ్లిన పోలీసు అధికారి తిరిగి వస్తాడని ఎదురుచూసే తల్లి, క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని ఆశించే భార్య, నాన్న రాక కోసం ఎదురుచూసే పిల్లలు ఉంటారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుటుంబాల ప్రేమానురాగాలను పక్కనపెట్టి, ప్రజల భద్రతే పరమావధిగా భావించి దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి ధైర్యసాహసాలు, అంకితభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, దేశ రక్షణతో పాటు ప్రజల భద్రత కోసం వారు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు.




