Burgampahad: సారపాక సుందరయ్య నగర్‌లో పోలీసుల మెరుపు తనిఖీలు!

Burgampahad: సారపాక సుందరయ్య నగర్‌లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 వాహనాలను సీజ్ చేసి, గంజాయి వాడకంపై హెచ్చరించారు.

RAVI, BURGAMPAD AREA
Published on: 27 Oct 2026 10:08 AM IST
Burgampahad
X

Burgampahad: సారపాక సుందరయ్య నగర్‌లో పోలీసుల మెరుపు తనిఖీలు!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం సారపాక సుందరయ్య నగర్‌లో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, ఆటోలను గుర్తించారు.

అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా

ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గంజాయికి యువత దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలను అరికట్టగలమని పేర్కొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని డీఎస్పీ సూచించారు. వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాల రక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్వంచ సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిపి సుమారు 50 మంది పాల్గొన్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA