Aswapuram: అశ్వాపురం రైతు వేదికలో మండల స్థాయి అధికారులతో పినపాక ఎమ్మెల్యే!

Aswapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం రైతు వేదికలో ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 7 Nov 2026 1:05 PM IST
Aswapuram
X

Aswapuram: అశ్వాపురం రైతు వేదికలో మండల స్థాయి అధికారులతో పినపాక ఎమ్మెల్యే!

Aswapuram: అశ్వాపురం మండలంలోని రైతు వేదిక వద్ద మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్షించారు. గ్రామాల వారీగా సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను వివరించారు.

సర్పంచులు ప్రస్తావించిన సమస్యలపై ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు.

ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు స్పందిస్తూ తమ శాఖల పరిధిలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు వివరించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, అశ్వాపురం మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA