Pinapaka: పోడు భూముల సమస్యలపై అటవీ అధికారులతో ఎమ్మెల్యే పాయం భేటీ
Pinapaka: పినపాక నియోజకవర్గంలోని గిరిజన రైతుల పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విస్తృతంగా చర్చించారు.
Pinapaka: పోడు భూముల సమస్యలపై అటవీ అధికారులతో ఎమ్మెల్యే పాయం భేటీ
భద్రాద్రి కొత్తగూడెం: పినపాక నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ జిల్లా అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్, ఐఎఫ్‌ఎస్, నిషా, ఉప అటవీ సంరక్షణ అధికారి బాబు తదితర అధికారులను కలిసి సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోడు భూములకు సంబంధించిన సమస్యలు, భూములపై హక్కులు, అటవీ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
గిరిజన రైతుల జీవనోపాధికి సంబంధించిన పోడు భూముల సమస్యను సానుకూలంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు అధికారులను కోరారు. అర్హులైన గిరిజన రైతులకు ప్రభుత్వ తరుపున న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
పినపాక నియోజకవర్గంలోని గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు. పోడు భూముల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడకుండా, వారి సమస్యలకు పరిష్కారం దిశగా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యే గారు ప్రస్తావించిన అంశాలను పరిశీలించి, సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.




