Burgampahad: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం!

Burgampahad: బూర్గంపాడు మండలం అంజనాపురంలో శుక్రవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించి పత్రాలు అందించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 20 Nov 2026 8:45 PM IST
Burgampahad
X

Burgampahad: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం!

బూర్గంపాడు: బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నమోదు ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పత్రాలను పినపాక శాసనసభ్యులు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి, ప్రతి అర్హ కుటుంబానికి భరోసా అందించడమే ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తూ, ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ, ఇందిరమ్మ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం గురించి తెలియజేసి, ఎవరూ ప్రయోజనానికి దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నమోదు సమయంలో లబ్ధిదారుల వివరాలు, అవసరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. పథకం అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ అనూష, ఎంపీడీవో, తహశీల్దార్, సంబంధిత అధికారులు,సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA