Palwancha: తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండించిన మల్లెల వీరనారాయణ
Palwancha: తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సమగ్ర విచారణ జరిపి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని వీరనారాయణ డిమాండ్ చేశారు.
Palwancha: తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండించిన మల్లెల వీరనారాయణ
పాల్వంచ: తీన్మార్ మల్లన్నపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ అన్నారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అన్నాజీపూర్ గ్రామం సమీపంలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లన్న కాన్వాయ్ ను లారీతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. బీసీ పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో ఇదే భువనగిరి ప్రాంతంలో బీసీల హక్కుల కోసం పోరాడిన మారోజు వీరన్న, బెల్లి లలిత, సాంబశివుడు వంటి ఉద్యమకారులపై జరిగిన దాడులను గుర్తుచేస్తూ, అదే తరహాలో మల్లన్నను అంతమొందించేందుకు కుట్ర జరిగిందా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని, మల్లన్నకు తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. మల్లన్నకు ఏదైనా ప్రాణహాని జరిగితే బీసీ ఉద్యమ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిరెడ్డి శ్రీనివాస్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు అటికేటి శంకర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మల్లెల నాగమణి, బూర్గంపాడు మండల అధ్యక్షులు వట్టికోట రామకృష్ణ, అశ్వాపురం మండల అధ్యక్షులు విలాసాగరం కోటేశ్వరరావు, సుజాతనగర్ మండల యూత్ అధ్యక్షులు మంద ఉమామహేశ్వరరావు, సుజాతనగర్ సోషల్ మీడియా కన్వీనర్ రష్మిక తదితరులు పాల్గొన్నారు.




