Palwancha: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై కాంపెల్లి కనకేష్ పటేల్ ప్రశ్నలు
Palwancha: పాల్వంచలో పాత లబ్ధిదారులను కాదనీ కొత్తగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రా నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంపెల్లి కనకేష్ పటేల్. అధికారుల స్పష్టతకు డిమాండ్.
Palwancha: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై కాంపెల్లి కనకేష్ పటేల్ ప్రశ్నలు
పాల్వంచ: పట్టణంలోని నవభారత్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారంపై పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. సోమవారం పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2023లో పాల్వంచ పాత 24 వార్డులకు చెందిన 1,976 మంది అర్హులను పరిశీలించిన అనంతరం అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పాత ఆర్డీవో కార్యాలయంలో డ్రా నిర్వహించి 380 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారికి స్లిప్పులు అందించడంతో పాటు తహసీల్దార్ కార్యాలయ నోటీస్ బోర్డులో పేర్లు ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం గతంలో ఎంపికైన 380 మంది లబ్ధిదారుల విషయాన్ని పక్కనపెట్టి, ఈ నెల 24న పెద్దమ్మ గుడి వద్ద కొత్తగా 360 మందికి డ్రా నిర్వహించడంపై ఆయన ప్రశ్నించారు. గతంలో ఎంపికైన లబ్ధిదారుల ఎంపికను రద్దు చేసినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా కొత్తగా డ్రా నిర్వహించడానికి కారణమేంటని ప్రశ్నించారు.
గతంలో ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని గుర్తించి తొలగించేందుకు అర్హతలను మరోసారి పరిశీలించాలని, అంతేకానీ మొత్తం 380 మంది లబ్ధిదారులను పక్కనపెట్టడం సరికాదని అన్నారు. నవభారత్ ప్రాంతంలో మొత్తం ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉన్నాయో, గతంలో ఎంపికైన 380 మందికి, ప్రస్తుతం ఎంపిక చేసిన 360 మందికి ఇళ్ల కేటాయింపు ఎలా జరుగుతుందో అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2023లో డ్రా ద్వారా ఎంపికైన 380 మంది లబ్ధిదారుల అర్హతలను పారదర్శకంగా పరిశీలించి, అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన 360 మంది కొత్త డ్రాకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు ప్రజలకు వెల్లడించాలని అన్నారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని కనకేష్ పటేల్ కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధితులతో కలిసి న్యాయపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని తెలిపారు.
విలేకరుల సమావేశంలో మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కాంపెల్లి నవీన్, కడలి సత్యనారాయణ, గుగులోతు శ్యామ్‌కుమార్, కాంపెల్లి భార్గవ్ నితీష్, కడలి రామకృష్ణ, గజేంద్రుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




