Palwancha: యజమానులు, కార్మికుల సఖ్యతే బలం: సీపీఐ సాబీర్ పాషా!

Palwancha: పాల్వంచలో నిర్వహించిన హోటల్ యజమానులు, కార్మికుల సమన్వయ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 12 Oct 2026 7:52 PM IST
Palwancha
X

Palwancha: యజమానులు, కార్మికుల సఖ్యతే బలం: సీపీఐ సాబీర్ పాషా!

పాల్వంచ: హోటల్ రంగంలో యజమానులు, కార్మికుల మధ్య పరస్పర అవగాహన, సఖ్యత ఎంతో కీలకమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. ఇరువర్గాలు పరస్పర గౌరవంతో వ్యవహరిస్తూ, సమస్యలు తలెత్తినప్పుడు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సోమవారం పాల్వంచలో హోటళ్ల యాజమాన్యాలు, కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కార్మికుల శ్రమ, యజమానుల నిర్వహణ హోటల్ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని సాబీర్ పాషా పేర్కొన్నారు. ఇరువర్గాలు ఒకే కుటుంబంలా మెలుగుతూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆహార వ్యాపార రంగంలో పాల్వంచకు ప్రత్యేక గుర్తింపు ఉందని, అనేకమందికి ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగులు, కుటుంబాల అవసరాలను తీర్చడంలో హోటళ్లు, రెస్టారెంట్లు కీలకంగా ఉన్నాయని తెలిపారు.

హోటల్ రంగంలో ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అపోహలకు తావివ్వకుండా యజమానులు, కార్మికులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ రంగం అభివృద్ధి దెబ్బతింటే వ్యాపారులతో పాటు కార్మికులు, వారిపై ఆధారపడిన కుటుంబాలకూ నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఎం జిల్లా నాయకుడు దొడ్డ రవి, సొసైటీ వైస్ చైర్మన్ కంపల్లి కనకేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజు గౌడ్, కాంగ్రెస్ నాయకుడు సాదం రామకృష్ణ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్, భద్రాచలం పట్టణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మినీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ జిందా, వాసు రాజు తదితరులు మాట్లాడుతూ.. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు హోటల్ వ్యాపారాలు సజావుగా సాగేందుకు రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు. యజమానులు, కార్మికులు సంయమనం పాటిస్తూ పరస్పర అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

హోటల్స్ యాజమాన్యులు, కార్మికుల సంఘం అధ్యక్షుడు వీసంశెట్టి విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, సీపీఎం నాయకుడు కె. సత్య, హోటల్ యజమానుల సంఘాల నాయకులు గడపల్లి వీరభద్రరావు, పోపుల నాగేశ్వరరావు, శ్రీను, ఎండీ కాజా, రెడ్డి, సంక్రాంతి రవి, ఎస్‌ఆర్ రెడ్డి, కృష్ణ, నాగవేణి, హోటల్ కార్మికులు వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాస్, కాసింబి, శశి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN