Palwancha: విప్లవోద్యమ అమరవీరులకు జోహార్లు: కల్లూరి కిషోర్!

Palwancha: పాల్వంచలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరుల ఆశయ సాధనకు పోరాడాలని జిల్లా నాయకుడు కల్లూరి కిషోర్ పిలుపునిచ్చారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 9 Nov 2026 6:54 PM IST
Palwancha
X

Palwancha: విప్లవోద్యమ అమరవీరులకు జోహార్లు: కల్లూరి కిషోర్!

పాల్వంచ, నవంబర్ 9: నవంబర్ నెలలో అమరవీరులను, వారి త్యాగాలను, లక్ష్యాలను స్మరిస్తూ సభలు జరపాలని రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు పాల్వంచలో పార్టీ ఆఫీస్ లో కా: రవన్న, డి.వి.కె లకు నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి కిషోర్ మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైనదని, మనిషికి మరణం కూడా సహజమైనదని, తన కోసమే తాను బతికిన జీవితం సాధారణమైనదని, తన జీవితాన్ని సమాజం కోసం, ఉన్నత లక్ష్యాల కోసం, తోటి మనుషుల కోసం జీవించిన వారు మహోన్నతులని అన్నారు. దోపిడిని, అన్యాయాన్ని ప్రశ్నించి సమతా సుందర లోకం అంటే సోషలిస్టు సమాజం కోసం జీవితం అర్పించిన వారు మహానీయులని అన్నారు.

భూమి కోసం, భుక్తి కోసం, పేదోళ్ల రాజ్యం కోసం, దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూస్వాముల పెత్తనానికి, అటవీ అధికారుల దౌర్జన్యాలకు ఎదురు నిలబడి ఎన్నో త్యాగాలు చేసి వారి అమూల్యమైన ప్రాణాలర్పించారని అన్నారు. ప్రాణాలు అర్పించిన వారిలో బత్తుల వెంకటేశ్వరరావు, నీలం రామచంద్రయ్య, పోట్ల రామనరసయ్య, రాయల సుభాష్ చంద్రబోస్, డి.వి. కృష్ణ, రాయల చంద్రశేఖర్, ఏనుగు అప్పయ్య, కాచనపల్లి అమరవీరుల వంటి ఎందరో అమరవీరులు మనకు ఇచ్చిన ఆశయాలను కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, ప్రభుత్వ భూములు, వేలాది ఎకరాల పోడు భూములు సాధించుకున్న చరిత్ర ఉందని అన్నారు. పాల్వంచ డివిజన్ ఈ ప్రాంత ఉద్యమానికి ఎంతో కృషి చేసిందని, అలాంటి వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు.

నేడు దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల ప్రభావంతో సమాజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. సైన్స్, సాంకేతికత, సంపద విరివిగా పెరిగింది. కానీ, అవి అతి కొద్ది మంది చేతిలోనే పోగుబడుతున్నాయి. అసమానతలు అధికమవుతున్నాయి. అంతరాలు పెరిగాయి. నిరుద్యోగం, అధిక ధరలు, భద్రత లేని ఉద్యోగాలతో సమాజంలో తీవ్ర అసంతృప్తి రాజుకుంటున్నదన్నారు.

మరోవైపు పాలక వర్గాలన్నీ 80 ఏండ్లుగా పేదల పేరు చెప్పి, ధనికులకు కొమ్ముకాస్తున్నాయి. దేశ సంపదను, ప్రజావనరులను దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నాయి. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత విచ్చలవిడిగా దేశ మౌలిక వనరులన్నింటినీ, ఆయిల్, ఖనిజాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఇస్రో, ఎల్.ఐ.సి, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. మోడీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో మతోన్మాదం, మూఢభక్తి, సనాతన ఆచారాల పేరుతో దేశ ప్రజల సమైక్యతను దెబ్బతీసి, విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు.

ప్రభుత్వ ఏజెన్సీలైన ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్.ఐ.ఎ.ల నుంచి చివరకు ఎన్నికల కమీషన్ నుంచి న్యాయ వ్యవస్థ దాకా తన జేబు సంస్థలుగా మార్చుకుందన్నారు. ప్రశ్నించేవాడు, ప్రజాస్వామిక హక్కుల్ని, రాజ్యాంగ మౌలిక హక్కులను అడిగేవాడు లేకుండా, చివరకు కమ్యూనిస్టులనే కాదు, ప్రతిపక్షాలనే లేకుండా చేయడానికి ఎంతో పకడ్బందీగా ఫాసిజాన్ని అమలు పరుస్తున్నారన్నారు.

ఎస్.ఐ.ఆర్ పేరుతో 13 కోట్ల 40 లక్షల మంది ఓట్లను అక్రమంగా తీసివేశారని, వారి పౌర, ప్రజాస్వామిక హక్కులు లేకుండా కుట్ర పన్నారన్నారు. ప్రజాస్వామికంగా కాకుండా ఓట్ చోరీ, నోట్ చోరీ, రిజల్ట్స్ చోరీ ద్వారా తమ ఫాసిస్టు రాజ్యాన్ని శాశ్వతం చేసుకోవాలని, ప్రజాస్వామిక విలువల్ని పాతర వేయాలని పెద్ద పథకం అమలు చేస్తున్నారని అన్నారు.

రేపిస్టులు, బ్యాంకు అప్పుల ఎగవేతదారులు, పేపర్ లీకేజీ బ్రోకర్లు, ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టే దొంగలు, అవినీతిపరులు బీజేపీకి పునాదులుగా మారారని అన్నారు. దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసం యువత, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ముఖ్యంగా కమ్యూనిస్టుల పాత్ర పెరగాలని అన్నారు. వర్తమాన పెట్టుబడిదారీ సమాజం, అందులో భాగమైన భారతదేశ సమాజం సంక్షోభంలో ఉన్నది.

దేశ పెట్టుబడిదారీ సమాజం ప్రజలకు రోజు రోజు భారంగా మారుతున్నది. ప్రజలకు, దేశానికి విప్లవం అవసరం. దాని కోసం అమరవీరుల స్వప్నాలైన సమసమాజం, నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించడానికి ప్రతిన బూనడమే వారికి అర్పించే నివాళి, శ్రద్ధాంజలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా కర్తవ్యాలను రూపొందించుకుని విప్లవిద్దాం. అమరవీరులకు విప్లవ జోహార్లు, అమరుల సోషలిస్టు స్వప్నాలకు వారసులుగా నిలబడదాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ పట్టణ కార్యదర్శి రాయబారపు వెంకటేశ్వర్లు, టియూసిఐ జిల్లా ఉపాధ్యక్షుడు గోనెల రమేష్, వేల్పుల రమేష్, కుంజ భాస్కర్, ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు కె.పద్మ, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN