Palvancha: పెద్దమ్మతల్లి ఆలయంలో రావి-వేప చెట్ల పునఃస్థాపన
Palvancha: పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో వర్షాలకు నేలకొరిగిన రావి-వేప చెట్ల స్థానంలో కడియం నుంచి తెప్పించిన 14 ఏళ్ల వయసున్న చెట్లను శాస్త్రోక్తంగా పునఃప్రతిష్టించారు.
Palvancha: పెద్దమ్మతల్లి ఆలయంలో రావి-వేప చెట్ల పునఃస్థాపన
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ సమీపంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) లో రావి-వేప చెట్ల పున:స్థాపన, పున:ప్రతిష్ట మహోత్సవం గురువారం ఉదయం 9 గంటలకు ఘనంగా జరిగింది.
ఆలయంలో అనేక సంవత్సరాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర రావి-వేప చెట్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగాయి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దాతలు ముక్కేవి గిరీష్ - హర్షిణి దంపతుల సహకారంతో కడియం నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగిన నూతన రావి-వేప చెట్లను తీసుకువచ్చి పున:స్థాపించారు.
అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా పున:ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అధికారులు మాట్లాడుతూ సహకరించిన దాతలు గిరీష్-హర్షిణి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ భాషా, సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నాగ సీతారాములు, రైతు సంఘం నాయకులు కసగాల అనంత రాములు, డిజెవైఎం జిల్లా అధ్యక్షులు జే మోహన్ కృష్ణ, ఆలయ మాజీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, జగన్నాధపురం సర్పంచ్ బానోతు అనిత, కేశవాపురం సర్పంచ్ బానోతు శ్రీదేవి, కార్పొరేటర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




