Palvancha: పెద్దమ్మగుడిలో 60 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం!

Palvancha: పాల్వంచ కేశవాపురం పెద్దమ్మగుడిలో 6వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూలా నక్షత్రం వేళ 60 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 16 Oct 2026 6:28 PM IST
Palvancha
X

Palvancha: పెద్దమ్మగుడిలో 60 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం!

పాల్వంచ, అక్టోబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) నందు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ఉత్సవాలలో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం ప్రాతఃకాలార్చన, లక్ష్మీ గణపతి అనుష్టానం, వేదపారాయణం, శ్రీ సూక్త, శుక్రవార పూజలు, శ్రీచక్రార్చన, మహాభిషేక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. మేళతాళాల నడుమ అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకువచ్చి పంచామృతాలతో అభిషేకం చేశారు.

మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 60 మంది చిన్నారులకు అక్షర స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెరుకూరి శివపార్వతి, జేకు జయప్రకాశ్-లక్ష్మి దంపతులు పలకలు, పుస్తకాలు అందజేశారు. అనంతరం చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అన్నప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం చండీహోమం, లక్షకుంకుమార్చన నిర్వహించారు.

ఈ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ అనంతరం శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి, ఎన్.కె.బాషా బృందం వారిచే జానపద నృత్యాలు ప్రదర్శించనున్నారు.

రేపు 7వ రోజు అనగా తేదీ 17.10.2026న ఉదయం 10 గంటలకు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ, నవగ్రహ పూజ, సుహాసిని పూజ నిర్వహించనున్నట్లు, అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN