Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో వైభవంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు. పూర్ణాహుతి, రథోత్సవం, హంసవాహనంపై తెప్పోత్సవం. బుధవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 21 Oct 2026 5:45 PM IST
Palvancha
X

Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో వైభవంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాధపురం గ్రామాల పరిధిలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో నిర్వహించిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి వేడుకలతో మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో చివరి రోజైన విజయదశమి సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. అనంతరం ఋత్విక్కులు, అర్చకుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తమ ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులకు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో మంచినీరు, పంపిణీతో పాటు వాహన పూజల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

సాయంత్రం కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మీదుగా అమ్మవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రథోత్సవంలో భక్తుల కోలాటాలు, అమ్మవారి వేషధారణలో కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం దేవస్థాన ప్రాంగణంలోని కోనేరులో హంసవాహనంపై తెప్పోత్సవం, జమ్మిచెట్టు వద్ద శమీపూజ నిర్వహించారు. ఉత్సవాలను భక్తులు వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.

ఉత్సవాల అనంతరం బుధవారం దేవస్థాన ఆవరణలో సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి వ్రతాన్ని అర్చకులు నిర్వహించారు. ఒక్కొక్కరు రూ.316 చెల్లించి భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించిన దాతలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, గ్రామ ప్రజలు, యువసైన్యానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి కృతజ్ఞతలు తెలిపారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN