Palvancha: దక్షిణాది గొంతు నొక్కేందుకే డీలిమిటేషన్ కూనంనేని

Palvancha: పాల్వంచలో డీలిమిటేషన్, ఓటర్ల జాబితా సవరణపై కూనంనేని సాంబశివరావు విమర్శించి డిసెంబర్ 1 నుంచి జైల్ భరో ఉద్యమానికి పిలుపునిచ్చారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Updated on: 28 Nov 2026 9:58 PM IST
Palvancha: దక్షిణాది గొంతు నొక్కేందుకే డీలిమిటేషన్ కూనంనేని
X

పాల్వంచ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, సీట్ల కుదింపు పేరుతో అన్యాయం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకుని దొడ్డిదారిన అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.

శనివారం పాల్వంచలోని సిపిఐ కార్యాలయం సీఆర్ భవన్‌లో నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా ఉందని, దీనిని దక్షిణాది ప్రజలంతా ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. ఓటర్ల జాబితాలను తారుమారు చేసే ఈ ప్రక్రియను నిలిపివేసి, పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులకు నిరసనగా 'మార్పు అవసరం (బద్లావ్ జరూరీ హై)' నినాదంతో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్త జైల్ భరో ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో నిరంతరం పోరాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలు భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా మాట్లాడుతూ జిల్లాలో జైల్ భరో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి, 2న భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముట్టడి, 3న మణుగూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో ఖమ్మంలో జరిగే మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) రాష్ట్ర మహాసభలు, జనవరి చివరి వారంలో భద్రాచలం కేంద్రంగా జరగనున్న అఖిల భారత ఆదివాసీ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని కోరారు.

ఉప్పుశెట్టి రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, ఎస్‌డీ సలీం, కే సారయ్య, సలిగంటి శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, మున్నా లక్ష్మీకుమారి, మూడ్ గణేష్, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జి. వీరస్వామి, భూక్య దాసురు, కందుల భాస్కర్, ఎస్‌కే ఫహీం తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN