Palvancha: డీజే మోతలతో దద్దరిల్లుతున్న పాల్వంచ!
Palvancha: పాల్వంచలో పోలీసుల హెచ్చరికలు బేఖాతరు: నిమజ్జనంలో హోరెత్తుతున్న డీజేల మోత. గుండెజబ్బు రోగులు, వృద్ధులు, చిన్నారుల విలవిల.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
Palvancha: డీజే మోతలతో దద్దరిల్లుతున్న పాల్వంచ!
పాల్వంచ: వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా పాల్వంచ పట్టణంలో డీజే మోతలు హోరెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానను సైతం లెక్కచేయకుండా యువత సినిమా పాటలకు ఫుల్ సౌండ్‌తో డీజేలు ఏర్పాటు చేసి చిందులు వేస్తున్నారు.
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పాల్వంచ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. డీజేలు వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం సౌండ్ బాక్సులు లేదా బ్యాండ్‌ను నిబంధనలకు లోబడి వినియోగించాలని నిర్వాహకులకు సూచించారు.
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఫుల్ సౌండ్‌తో డీజేల్లో సినిమా పాటలు వినిపిస్తున్నా డీజేలపై చర్యలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసుల హెచ్చరికలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అధిక శబ్దంతో డీజేలు కొనసాగుతుండటంతో వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అధిక శబ్దం వల్ల ఎవరికైనా తీవ్ర ఆరోగ్య సమస్య తలెత్తితే.. అందుకు బాధ్యత ఎవరిది? గుండె సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తికి ప్రాణాపాయం సంభవిస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు కొనసాగుతున్న పరిస్థితిపై పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరోవైపు నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు.




