Palvancha: ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో నేతల నివాళులు

Palvancha: పాల్వంచ దమ్మపేట సెంటర్‌లో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో తోట దేవీ ప్రసన్న నివాళులర్పించి, ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 19 Nov 2026 10:26 PM IST
Palvancha
X

Palvancha: ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో నేతల నివాళులు

పాల్వంచ: భారత తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగిరెడ్డి భువన సుందర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోట దేవీ ప్రసన్న మాట్లాడుతూ దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పాలన స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు మాట్లాడుతూ పాల్వంచలోని దమ్మపేట సెంటర్‌కు ఇందిరమ్మ సెంటర్‌గా నామకరణం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ మేయర్ లలిత కుమారి రానున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదింపజేసి, దమ్మపేట సెంటర్‌కు ఇందిరమ్మ సెంటర్‌గా నామకరణం చేసేందుకు ప్రతిపాదిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లలిత కుమారి, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బాలు నాయక్, మల్సూరి ప్రసాదరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గద్దల రమేష్, జిల్లా అధికార ప్రతినిధి గోలి సదాశివ, కార్పొరేటర్లు కాల్వ భాస్కర్ రావు, చరపా శాంత, దంతెబోయిన నరేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN