Khammam: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఘనంగా నిర్వహించాలి: మంత్రి!
Khammam: డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను ఘనంగా నిర్వహించాలని మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం కలెక్టర్లను ఆదేశించారు.
Khammam: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఘనంగా నిర్వహించాలి: మంత్రి!
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చేలా జిల్లాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తూ, ప్రజలు, విద్యార్థులు, యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. సోని బాలాదేవి తదితరులతో కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ ఖేలో ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమం గురించి తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి, ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి కూడా హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షించాలని, చిన్నపాటి లోటుపాట్లకు కూడా అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు.
ఖేలో ఇండియా కార్యక్రమంపై ప్రతిరోజూ ప్రత్యేక కథనాలు, వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యేలా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించారని, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని, పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి క్రీడా వేదికను, సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అవసరమైన మౌళిక సదుపాయాలు సిద్ధం చేయాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రాబోయే నెల రోజుల కాలం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమని, ఒకవైపు భారీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహణకు సన్నద్ధమవుతుండగా, మరోవైపు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని, పోటీలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి గురుకుల పాఠశాల, విద్యాసంస్థకు ఖేలో ఇండియా కార్యక్రమం గురించి తెలియజేయాలని, విద్యార్థులు, యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాము లనుచేస్తూ టార్చ్‌లైట్ ర్యాలీలు నిర్వహించా లని సూచించారు. ఈ ర్యాలీల ద్వారా క్రీడలపై అవగాహన కల్పించి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని తెలిపారు.
ఖేలో ఇండియా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేశామని, మరో 15 రోజుల్లో అదనంగా రూ.5 లక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల అవసరాలు, అంచనాల ఆధారంగా అదనపు నిధులు కూడా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశపు ప్రతిష్టాత్మక జాతీయ యువ క్రీడా సంబరమైన 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ సంస్థల జట్ల నుంచి యువ క్రీడాకారులు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారని వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఆర్చరీ పోటీల నిర్వహణకు అవసరమైన క్రీడా వేదికలు, మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డివైఎస్ఓ టి. సునీల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




