Sarapaka: సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీలో సిబ్బంది నిర్లక్ష్యం.. రోగుల ఆగ్రహం!
Sarapaka: సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీలో సిబ్బంది నిర్లక్ష్యం, రోగుల పట్ల స్టాఫ్ నర్స్ దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sarapaka: సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీలో సిబ్బంది నిర్లక్ష్యం.. రోగుల ఆగ్రహం!
Sarapaka: పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీలో సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం కోసం ఆశతో వచ్చే రోగుల పట్ల కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మందులు పంపిణీ చేసే సమయంలో స్టాఫ్ నర్స్ రోగులతో మర్యాదగా వ్యవహరించకుండా, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ పలువురు రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన సిబ్బంది వ్యక్తిగత ఈగోలకు ప్రాధాన్యత ఇస్తే సామాన్య రోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
డ్రెస్ కోడ్ ఎక్కడ? అధికారుల తనిఖీలప్పుడేనా?
ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే డాక్టర్, స్టాఫ్ నర్స్, అటెండర్ తదితర సిబ్బంది విధి నిర్వహణ సమయంలో తప్పనిసరిగా నిర్ణీత డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. అయితే సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీలో మాత్రం ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే డ్రెస్ కోడ్ కనిపిస్తోందని, మిగిలిన సమయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందిస్తారా?
రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్టాఫ్ నర్స్ తీరుపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయోనని బాధితులు ఎదురుచూస్తున్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటే సామాన్య రోగులు ఎవరిని ఆశ్రయించాలి? రోగులతో మర్యాదగా వ్యవహరించలేని సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటారా? లేక ఫిర్యాదులను పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జిల్లా వైద్యాధికారులు తక్షణమే స్పందించి సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సిబ్బంది విధి నిర్వహణ, డ్రెస్ కోడ్, రోగులతో వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.




