Kothagudem: అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్‌కు జాతీయ గుర్తింపు!

Kothagudem: అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన పాల్వంచ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వర్గీయ బి. నవీన్ సేవలకు జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలో కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 23 Nov 2026 3:25 PM IST
Kothagudem
X

Kothagudem: అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్‌కు జాతీయ గుర్తింపు!

కొత్తగూడెం: అటవీ సంపద పరిరక్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ డివిజన్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వర్గీయ బి. నవీన్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ నేరాల నియంత్రణలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారంతో గౌరవించింది.

2026 నవంబర్ 23న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి చేతుల మీదుగా నవీన్ కుటుంబ సభ్యులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ హాజరయ్యారు.

పాల్వంచ రేంజ్ పరిధిలోని చెరువుసింగారం వెస్ట్ బీట్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన నవీన్.. అటవీ సంపదను కాపాడటంలో, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో అంకితభావంతో పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ ఉచ్చుకు సంబంధించిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఒక క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగి సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం తెలంగాణ అటవీ శాఖకు గర్వకారణమని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. నవీన్ సేవా స్ఫూర్తి భవిష్యత్ తరాల అటవీ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా స్వర్గీయ బి. నవీన్ తరఫున పురస్కారం స్వీకరిస్తున్న కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM