Mulakalapalli: సాకివాగులో ఘనంగా బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు!
Mulakalapalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగులో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Mulakalapalli: సాకివాగులో ఘనంగా బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు!
ములకలపల్లి, నవంబర్ 9: ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని రాచన్నగూడెం పంచాయతీ సాకివాగు గ్రామంలో 15 రోజుల జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలు, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ, మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడారు. బిర్సా ముండా గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించారని, ఆయన పోరాట స్ఫూర్తిని, గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్ విజయ అన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సర్పంచ్ ఆదిలక్ష్మి పిలుపునిచ్చారు.
వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో స్థానిక కళాకారులతో కలిసి సర్పంచులు సంప్రదాయ నృత్యాలు చేసి సందడి చేశారు. అనంతరం గ్రామ పెద్దలను సర్పంచులు, కార్యదర్శి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వర్గాల వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి బిట్ట వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పద్దం లక్ష్మణరావు, మడివి సోనయ్య, మడకం రవి, కోవాడి రాజు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.




