Mulakalapalli: మూకమామిడి–మొగరాలగుప్ప మధ్య డైవర్షన్ రోడ్డు పనులు ప్రారంభం
Mulakalapalli: మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వంతెన స్థానంలో రూ.20 లక్షలతో తాత్కాలిక డైవర్షన్ రహదారి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
Mulakalapalli: మూకమామిడి–మొగరాలగుప్ప మధ్య డైవర్షన్ రోడ్డు పనులు ప్రారంభం
ములకలపల్లి: మురసు తుఫాను ప్రభావంతో ములకలపల్లి మండల పరిధిలోని మూకమామిడి–మొగరాలగుప్ప గ్రామాల మధ్య దెబ్బతిన్న హైలెవల్ వంతెన స్థానంలో తాత్కాలిక డైవర్షన్ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైలెవల్ వంతెన దెబ్బతినడంతో పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంతెన దెబ్బతినడంతో విద్యార్థులు, రైతులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు డైవర్షన్ రహదారి నిర్మాణం చేపట్టామని, రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో శాశ్వత వంతెన నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు సమకూర్చి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
తక్షణమే స్పందించి డైవర్షన్ రహదారి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేకు మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మితో పాటు గ్రామస్తులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, ఎస్సై మధు ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి దోమల అరుణ్ కుమార్, నాయకులు కారం సుధీర్, కీసరి రాజ్ కుమార్, బచ్చల చైతన్య కుమారి, తాటి తులసి, కీసరి వెంకటేశ్వర్లు, వెంకట్రావు, గోపాలరావు, బాబురావు, గోపయ్య, అనంతల సత్యనారాయణ, మొత్తం శ్రీను, కాకా బాబురావు తదితరులు పాల్గొన్నారు.




