Mulakalapalli: మాధారం అంగన్‌వాడీకి పక్కా భవనం నిర్మించాలి
Mulakalapalli: మాధారం గ్రామంలో తుపాను వర్షాలతో బురదమయమైన అంగన్‌వాడీ కేంద్రం. సొంత భవనం నిర్మించాలని ధర్నా చేపట్టిన తెలంగాణ రైతు సంఘం నేత రవికుమార్.
Mulakalapalli: మాధారం అంగన్‌వాడీకి పక్కా భవనం నిర్మించాలి
ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం పరిసరాలు తుపాను ప్రభావంతో బురదమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో చిన్నారులు కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం ఆయన అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, గ్రామస్తులు, అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారులతో కలిసి అద్దె భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. కేంద్రం పరిసరాలు పూర్తిగా బురదమయంగా మారడంతో చిన్నారులు లోపలికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొందరు చిన్నారులు కేంద్రానికి వెళ్లలేక ఇళ్లకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
గ్రామంలో ఏళ్ల తరబడి అంగన్‌వాడీ కేంద్రం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు సొంత భవనం నిర్మించకపోవడం విచారకరమన్నారు. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు, ముఖ్యంగా మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ఒకే చిన్న గదిలో నిర్వహిస్తుండటంతో స్థలాభావం సమస్యగా మారిందన్నారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మాధారం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన పక్కా భవనాలు మంజూరు చేసి, చిన్నారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు శనగాని వినోద్, పసుల సూర్య, ముదిగొండ రవి, అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.




