Mulakalapalli: కొట్టుకుపోయిన వంతెనల వద్ద తాత్కాలిక రోడ్లు నిర్మించాలి
Mulakalapalli: మురసు తుఫాను వరదలకు దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు. తాత్కాలిక రహదారులు నిర్మించాలని డిమాండ్.
Mulakalapalli: కొట్టుకుపోయిన వంతెనల వద్ద తాత్కాలిక రోడ్లు నిర్మించాలి
ములకలపల్లి: మురసు తుపాను ప్రభావంతో వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన మొగరాలగుప్ప, రాజుపేట వాగుల వద్ద తక్షణమే తాత్కాలిక డైవర్షన్ రహదారులు నిర్మించి రాకపోకలను పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ నాయకుల బృందంతో కలిసి ఆయన వరదలకు దెబ్బతిన్న వంతెనలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మొగరాలగుప్ప వద్ద వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు అవస్థలు పడుతున్నారని అన్నారు. రాకపోకలు నిలిచిపోయినా ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు.
రాజుపేట వద్ద రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన డైవర్షన్ రోడ్డు స్వల్ప వరదకే కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. ఈ పనుల నాణ్యతపై విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ములకలపల్లి-దమ్మపేట మధ్య రాకపోకలు సజావుగా సాగేందుకు వెంటనే ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు.
అలాగే తుపాను ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కోరారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు నిమ్మల మధు, లక్ష్మీనరసయ్య, కీసరి రాజ్‌కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




