Khammam: ఖేలో ఇండియా-2026 పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి!
Khammam: ఖేలో ఇండియా-2026 పోటీలకు రూ.203 కోట్లతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి వాకాటి శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి.
Khammam: ఖేలో ఇండియా-2026 పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి!
Khammam: ఖేలో ఇండియా-2026 క్రీడా పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకాటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీ వాణి, స్పోర్ట్స్ ఎండీ సోని బాలాతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖేలో ఇండియా-2026 పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.182 కోట్లు కలిపి మొత్తం రూ.203 కోట్ల అంచనా వ్యయంతో పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్రీడా మైదానాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచాలని, చేపట్టే అభివృద్ధి పనులు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.
పోటీల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. మొత్తం 27 క్రీడాంశాలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఖేలో ఇండియా పోటీల్లో సుమారు 7,500 మంది క్రీడాకారులు, 2,000 మంది సహాయక సిబ్బంది పాల్గొననున్న నేపథ్యంలో వారికి అవసరమైన వసతి, రవాణా, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలకు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పతకాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఖేలో ఇండియా ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, మెట్రో, బస్ స్టేషన్లు, సినిమా థియేటర్లతో పాటు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. నీలమణి, పాలపిట్టలతో కూడిన ఖేలో ఇండియా మాస్కాట్లను ప్రచారంలో వినియోగించాలని, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, సీఎస్ఆర్ నిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు విస్తృత ప్రచారం నిర్వహించి, డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు క్యాంపస్ రిపోర్టింగ్ చేపట్టి, డిసెంబర్ 11వ తేదీ నుంచి క్రీడా పోటీలను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, క్రీడా మైదానాల్లో పండుగ వాతావరణం నెలకొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
టార్చ్ రిలే కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ క్రీడాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. స్థానిక సంస్కృతి, క్రీడా స్ఫూర్తితో పాటు నషా ముక్త్ తెలంగాణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటి నిల్వలపై కూడా మంత్రి సమీక్షించారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా చెరువులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ఇరిగేషన్ శాఖ ద్వారా అంచనా వేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటి లభ్యత ఆధారంగా చేప పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖేలో ఇండియా-2026 పోటీలను దేశంలోనే అత్యుత్తమ క్రీడా కార్యక్రమంగా నిలిపేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




