Khammam: ఖమ్మం అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల సమీక్ష!
Khammam: ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్ష. వెలుగుమట్ల కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలని ఆదేశం.
Khammam: ఖమ్మం అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల సమీక్ష!
Khammam: ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్‌లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఖమ్మం నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచుకొండ ఎత్తిపోతల పథకం పరిధిలోని అన్ని చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుగ్గవాగు ఎత్తిపోతల పథకం పనులు చాలా కాలంగా ఆలస్యమవుతున్నాయని, పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. బుగ్గవాగు నీటిని గ్రావిటీ ద్వారా ఏఏ కాలువలకు అందించవచ్చో పరిశీలించి, అవసరమైన అంచనాలను సవరించి సమర్పించాలని ఆదేశించారు. పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని తెలిపారు.
మున్నేరు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు అవసరమైన 10-ఏ మినహాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పనుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించే ధోరణిని మార్చుకోవాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా బాధ్యతతో పనిచేయాలని అన్నారు. డ్రైనేజీ డిజైన్లు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లేఅవుట్‌ను త్వరగా తుది రూపంలో సిద్ధం చేయాలని, వచ్చే వర్షాకాలం లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాగునీరు, త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అన్నారు. గోదావరి జలాలను సక్రమంగా ప్రణాళిక చేసుకుని వినియోగించాలని, ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 15 వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలువలు, షట్టర్లు, నీటి మట్టాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వచ్చే సీజన్ నుంచి అన్ని నిర్వహణ పనులను వేసవిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.
త్రాగునీటినీ జాగ్రత్తగా వినియోగించాలని, నీటి విడుదల సమయాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని మంత్రి సూచించారు. ఎక్కడా నీటి లీకేజీలు లేకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని ఎత్తిపోసుకునే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
రోడ్లపై ఎలాంటి ఆక్రమణలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. కేబుల్ బ్రిడ్జి పనులకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున పనులను త్వరగా పూర్తి చేయాలని, నవంబర్‌లో హ్యాండోవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హ్యామ్ రోడ్లలో ప్రస్తుతం మంజూరైన బలోపేత పనులు అవసరం లేదని, నాలుగు లేన్ల రహదారి విస్తరణను ఇల్లందు వరకు చేపట్టేలా అవసరమైన అంచనాలను సవరించాలని సూచించారు. మెడికల్ కళాశాల హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి కేబుల్ బ్రిడ్జితో పాటు ప్రారంభించేలా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
మంజూరైన అన్ని పనులను అక్టోబర్ నుంచి ప్రారంభించేలా సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు, ఇతర పత్రాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు అనుకూలమైన పనుల సీజన్‌ను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని తెలిపారు.
వచ్చే రబీ సీజన్‌కు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచే పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత లేకపోవడం, కాలువల ద్వారా సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రత్యామ్నాయ రబీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఎల్‌నినో పరిస్థితులను అనుకూలంగా వినియోగించుకుని ఆయిల్‌పామ్ సాగును విస్తృతంగా పెంచాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తున్న వారికి తదుపరి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అర్హులైన వారికే ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వెలుగుమట్ల కాలనీలోని అన్ని ఇళ్లను నవంబర్ 21లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం, విద్యుత్ లైన్లు, డ్రైనేజీ తదితర అన్ని మౌళిక వసతుల పనులను పూర్తి చేసి కాలనీని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసేలా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అనుసంధానం చేయాలని, మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఖమ్మం నగరానికి వచ్చే పదేళ్లలో అవసరమయ్యే విద్యుత్‌ను అంచనా వేసి సబ్‌స్టేషన్లను ప్రణాళిక చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్ కేబుళ్లతో పాటు అవసరమైన ఇతర కేబుళ్లను భూగర్భంలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రహదారి విస్తరణ, భూగర్భ కేబుళ్లు, తదితర పనులను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు.
గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు దశల వారీగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అన్నారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేసి అవసరమైన పనులను చేపట్టాలని, అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో కనీస మౌళిక వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఖమ్మంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వచ్చే జూన్ లోగా పూర్తి చేయాలని, రాష్ట్రంలో తొలి యంగ్ ఇండియా స్కూల్‌గా ఖమ్మం పాఠశాలను ప్రారంభించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖమ్మంలో షాదీఖానా నిర్మాణానికి అనువైన స్థలాన్ని, హరిత భవన్‌కు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. కమ్యూనిటీ అసోసియేషన్లకు భూమి కేటాయింపులను ఒకే ప్రాంతంలో చేపట్టేలా స్థలాన్ని గుర్తించి అవసరమైన కేటాయింపులు చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ మంచుకొండ ఎత్తిపోతల పథకం పరిధిలోని చెరువులను నింపుతున్నట్లు తెలిపారు. మున్నేరు రక్షణ గోడ మిగిలిన పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హ్యామ్ రోడ్లకు సంబంధించి 10 పనులకు రూ.36.60 కోట్ల మంజూరు లభించిందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఏడు కొత్త సబ్‌స్టేషన్లు ప్రతిపాదించామని, వాటికి అవసరమైన భూములు కేటాయించామని కలెక్టర్ తెలిపారు. భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు వెల్లడించారు.
ఈ సీజన్‌లో జిల్లాలోని 20 మండలాల్లో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం కేవలం 7 వేల ఎకరాలు మాత్రమే తగ్గిందని తెలిపారు. పెసర సాగు విస్తీర్ణం పెరిగిందని, ఈ ఏడాది అదనంగా 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టినట్లు వివరించారు.
ఖమ్మం ఖిల్లా రోప్‌వే దిగువ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని, 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంజూరైన 137 పనుల్లో 54 పనులు పూర్తయ్యాయని, మరో 54 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి నిల్వ సమస్యలను పరిష్కరించామని, ప్రధాన రహదారులపై యంత్రాలతో స్వీపింగ్ నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు.
ఈ సమీక్షలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.




