Kothagudem: కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: తుమ్మల
Kothagudem: కొత్తగూడెం ఐడీవోసీలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లాలో ఎయిర్‌పోర్ట్, రైల్వే, రహదారి విస్తరణపై కీలక ప్రకటన చేశారు.
Kothagudem: కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: తుమ్మల
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాకు విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రజా పాలన దినోత్సవ సందేశాన్ని అందించారు.
అనంతరం పత్రికా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజన్నారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పేద ప్రజల సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. యువతకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యా సంస్థలు, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సాగునీరు, విద్యుత్, మార్కెటింగ్, రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విస్తృతమైన సహజ వనరులు, అటవీ సంపద, గిరిజన సంస్కృతి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు ఉత్పత్తి, పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో జిల్లా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా, వైద్య రంగాల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి రహదారి, రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు . పాండురంగాపురం నుంచి మాల్కంగిరి వైపు రైల్వే మార్గం అభివృద్ధి ద్వారా భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి–జగదల్‌పూర్ జాతీయ రహదారిని కొత్తగూడెం, భద్రాచలం మీదుగా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొత్తగూడెం–ఇల్లెందు–హైదరాబాద్ మార్గాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు జిల్లాలోని ఇతర ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రహదారి, రైల్వే రవాణాతో పాటు గోదావరి నదీ మార్గం ద్వారా రవాణా అవకాశాలను అభివృద్ధి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, పర్యాటకం, మౌలిక వసతులు తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి,జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




