Aswaraopeta: మురసు తుఫాన్ ఉధృతి.. అంకమ్మ చెరువును పరిశీలించిన మంత్రి!
Aswaraopeta: మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేటలో తెగిన అంకమ్మ చెరువును, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Aswaraopeta: మురసు తుఫాన్ ఉధృతి.. అంకమ్మ చెరువును పరిశీలించిన మంత్రి!
Aswaraopeta: మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో కురిసిన అత్యంత భారీ వర్షాలకు గండిపడిన అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత రైతులకు జరిగిన పంట నష్టాన్ని, దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించాయి. భారీ వరదల కారణంగా ఉద్యాన పంటలు, వరి పంటలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది.
పలు ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట నష్టం, రహదారుల మరమ్మతులకు సంబంధించి పూర్తి వివరాలతో ఈరోజు సాయంత్రంలోగా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అందజేస్తాం.
ప్రతికూల వాతావరణంలోనూ పామాయిల్ సాగు రైతులకు భరోసా అత్యంత భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ పామాయిల్ సాగుకు పెద్దగా నష్టం వాటిల్లకుండా పంట నిలబడటం విశేషమని మంత్రి పేర్కొన్నారు.
అతివృష్టి, అనావృష్టి వంటి అసమతుల్య వాతావరణ పరిస్థితులు తరచూ ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో పామాయిల్ సాగు రైతాంగానికి ఒక వరంగా మారుతోందని ఈ పరిస్థితులు మరోసారి నిరూపించాయని మంత్రి తుమ్మల అన్నారు.
రైతులకు అండగా నిలుస్తూ, పంట నష్టం అంచనా, రహదారుల పునరుద్ధరణ, దెబ్బతిన్న చెరువుల మరమ్మతుల పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.




