Khammam: ఖమ్మంలో రూ.1.80 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన!
Khammam: ఖమ్మం 48వ డివిజన్‌లో రూ.1.80 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేసి, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడారు.
Khammam: ఖమ్మంలో రూ.1.80 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన!
ఖమ్మం, అక్టోబర్- 5: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం నగరపాలక సంస్థ పరిధిలోని ఎఫ్ సిఐ బైపాస్ రోడ్డు దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ నుండి ఎంబి గార్డెన్స్ వరకు రూ. 180.00 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందాలని అన్నారు. ఇళ్లు కేటాయించేటప్పుడు గుడిసెలలో నివసించే నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డివిజన్‌లో ప్రజలకు అవసరమైన డ్రెయిన్లు, పార్కులు, రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్ లైన్ల వంటి మౌళిక వసతుల పనులను వెంటనే మంజూరు చేయించి వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.
పేదరికం నుండి శాశ్వత విముక్తి పొందేందుకు చదువు ఒక్కటే మార్గమని మంత్రి అన్నారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి సహకారంతో మోడల్ స్కూళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పాటు కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు వెచ్చించి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్య, వసతి, పుస్తకాలు, దుస్తులు అందిస్తోందని అన్నారు.
నగరంలో కబ్జాలు, దౌర్జన్యాలు, పోలీస్ కేసుల ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖసంతోషాలు, ప్రశాంతతతో జీవించాలన్నదే తమ ఆకాంక్ష అని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే దసరా పండుగ సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి కానుకగా చిలకపచ్చ చీరల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధికి ప్రజలందరూ బాధ్యతాయుతంగా తమ వంతు కృషి చేయాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




