Khammam: అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!
Khammam: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.
ఖమ్మం/తిరుమలాయపాలెం, అక్టోబర్ -11: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
మంత్రి తెట్టెలపాడు గ్రామంలో తెట్టెలపాడు నుండి బీరోలు ఆర్ అండ్ బి రోడ్డు వరకు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంఖుస్థాపన, సుబ్లేడ్ గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. తిరుమలాయపాలెం మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇది ప్రజలు మనస్పూర్తిగా ఆశీర్వదించిన ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి మంచి చేయాలని, పేదవాళ్ళకి అండదండలుగా ఉండాలని, పేదవాడి కుటుంబం కూడా చిరునవ్వులతో ఎప్పుడూ జీవించాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ 33 నెలల్లో మీ గుమ్మానికి చేర్చిందన్నారు.
200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్‌గా క్వింటాలుకు 500 రూపాయలు, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుతో పాటు, పెద్దోళ్ళు తినే సన్నబియ్యం బువ్వ నా పేదెంటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు.
డ్వాక్రా మహిళలకి కోటి మందిని కోటీశ్వరులను చేయాలని, ఈ 33 నెలల్లోనే 72,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇచ్చే కార్యక్రమం అమలు చేశామన్నారు. పెద్దోళ్ళ పిల్లలు చదివే స్కూళ్లకు దీటుగా ఇంటర్నేషనల్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేద పిల్లలు చదివే స్కూళ్లలో 40 శాతం డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకు కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చామని, రెండో విడత రెండున్నర లక్షల ఇళ్లు ఇస్తూ, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, రమారమి అన్నీ కలిపి 8 లక్షల ఇళ్లు, 40 వేల కోట్ల రూపాయలు రెండు విడతల్లో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. రెండుసార్లు ఇళ్లు ఇచ్చాం, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇక ఇవ్వము అనేది లేదని, మూడోసారి, నాలుగోసారి ఇస్తామని, అర్హులైన ప్రతి పేదవాళ్లకి నాలుగు విడతల్లో 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చేది ఈ ఇందిరమ్మ ప్రభుత్వమే నని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు, ఏ పార్టీ అని, ఏ కులమని, ఏ మతమని అడగమని, చివరికి ఇల్లు ఇస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తావా అని కూడా అడగమని అన్నారు.
ఒక్క ఇళ్ల కార్యక్రమే కాదు, పేదవాళ్ళ పక్షపాతంగా ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో చెప్పిన ప్రతి మాటని పేదింటి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని మంత్రి అన్నారు. ఆసరా పెన్షన్ కానీ, పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వాల్సినవి వందకు వంద శాతం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని పేదింటి ఆడబిడ్డలకి పంచుతామని మంత్రి అన్నారు.
ఎల్నినో ప్రభావం ఒక్క తెలంగాణ రాష్ట్రానికో, భారతదేశానికో కాదని, ప్రపంచవ్యాప్తంగా రాబోయే కొద్ది నెలలు కరెంటుతో పాటు నీటి తాగునీరు సమస్య కూడా రాబోతుందన్నారు. రైతన్నలు మొదటి పంట వేసుకున్నారని, ఎంత ఖరీదైనా కరెంటును కొని వేసిన పంటను నష్టపోకుండా, ఎండిపోకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రెండో పంట వేయడానికి నీళ్లు లేవని, 15 రూపాయలకు యూనిట్ చొప్పున కొందామన్న కరెంటు దొరకటం లేదని తెలిపారు. రైతన్నలు అర్థం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా రెండో పంటను వేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న పంటని ఏది ఏమైనా పండించే కార్యక్రమం చేస్తామని, రెండో పంట వేసి కరెంటు లేక, నీళ్లు లేక రైతన్నలు ఇబ్బంది పడొద్దని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, డీఆర్డీవో శ్రీరామ్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఎంపీడీవో సిలార్ సాహెబ్, సర్పంచ్ లు నర్సమ్మ, స్వాతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




