Sathupally: సత్తుపల్లిలో కొత్త చేయూత పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి!

Sathupally: సత్తుపల్లిలో కొత్త చేయూత పింఛనుల మంజూరు పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 18 Nov 2026 9:57 AM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో కొత్త చేయూత పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి!

Sathupally: పేదల ప్రజల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో సత్తుపల్లి మునిసిపల్ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రి కొత్త చేయూత పింఛనుల మంజూరు పత్రాలను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, పేదవాడి కష్టం ఎరిగి, వారికి ఏది చేస్తే మేలు జరుగుతుందో అటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామన్నారు.

అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు అందజేయడంతో పాటు, పెద్దోళ్ళు తినే సన్నబియ్యాన్ని పేదింటి ఆడబిడ్డలు కూడా తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

​కోటి మంది డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గడిచిన 33 నెలల్లో రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించడం జరిగిందని తెలిపారు.

పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇళ్లు అందించే బృహత్తర కార్యక్రమం కింద మొదటి విడతలో 4.5 లక్షలు, రెండవ విడతలో 2.5 లక్షలు, హైదరాబాదులో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను రూ. 40 వేల కోట్ల వ్యయంతో పేద మహిళలకు ఇళ్లు కట్టించుకునేందుకు ఇస్తున్నామన్నారు. పేదవారికి విద్య, వైద్య రంగాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందనీ మంత్రి అన్నారు.

​దీపావళి నాడు ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా, గడిచిన 10 సంవత్సరాలుగా ఆసరా పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త పింఛన్లు అందించే కార్యక్రమం అమలుచేస్తున్నామన్నారు. ​

సత్తుపల్లి మునిసిపాలిటీ హెడ్‌క్వార్టర్స్‌లో సుమారు 1,252 చేయూత పింఛన్లను ప్రతి నెలా రూ. 2 కోట్ల 18 లక్షల చొప్పున పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పింఛనుదారులు ఎవరైనా మృతి చెందితే, వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్‌గా పింఛను వర్తింపజేసే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

​గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా, వాటిని పంటపొలాల్లో రక్షణకు వాడారే తప్ప ఆడబిడ్డలు ఎవ్వరు కట్టుకోలేదని, ఈ ప్రభుత్వం పేద ఆడబిడ్డలకు పాలపిట్ట రంగు చీరలు అందించిందని, రాబోయే రోజుల్లో నవంబర్ 19న ఆడబిడ్డలకు చిలకపచ్చ చీరలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 నుండి గ్రూప్-4 వరకు సుమారు 72 వేల ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేయడం జరిగిందని అన్నారు. ఇది పేదల ప్రభుత్వం అని, పేదల పక్షాన నిలబడి వారి అవసరాలను గుర్తించి సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులు మిగిలించగా, ప్రజలందరిపై లక్షల రూపాయల భారం ఉండిందన్నారు.

ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అనేక కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ​మహిళలందరికీ మేలు చేకూరుస్తూ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఒక్కో ఏడాదికి రూ. 7 వేల కోట్ల ఖర్చు ప్రభుత్వ భరిస్తోందని తెలిపారు.

గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందన్నారు. రేషన్ ద్వారా సన్నబియ్యం అందించేందుకు సుమారు రూ. 13 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.

​రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, అలాగే 70 వేల కొత్త ఉద్యోగాలను కల్పించామని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్లు మంజూరు చేయబడుతున్నాయని, ఇందుకోసం ఇప్పటికే రూ. 40 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.

అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గతంలో పెన్షన్లు ఇవ్వలేదని ప్రశ్నించిన వారికే నేడు నిరాటంకంగా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ​కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పేదల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తదుపరి విడతలు కూడా క్రమంగా కొనసాగుతాయని, ప్రజల ప్రతి సమస్యకు ప్రభుత్వం స్పందించి అండగా నిలుస్తుందని అన్నారు.

కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, సత్తుపల్లి మునిసిపాలిటి పరిధిలో ప్రస్తుతం కొత్తగా మరో 1,252 పింఛన్లను అదనంగా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా విచారించి, ఎటువంటి పరిమితులు విధించకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఈసారి పింఛన్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు.

ఎంతోకాలంగా దరఖాస్తు చేసుకుని, సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి నేడు న్యాయం జరిగిందని, లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు. దివ్యాంగులకు నెలకు రూ. 4,016 చొప్పున, ఇతర అన్ని రకాల పింఛన్ లబ్ధిదారులకు నెలకు రూ . 2,016 చొప్పున అందిస్తున్నామని తెలిపారు.​

ఈ ఆర్థిక సహాయం ద్వారా లబ్ధిదారులు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, గత పదేళ్లుగా నూతన పింఛన్ల కోసం ఎంతో మంది పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఎదురుచూశారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నేడు కొత్త పింఛన్లను పంపిణీ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో నిధులు మంజూరు చేస్తూ, అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

​ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు మరియు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆసరాగా నిలిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అన్నలా ఆలోచించి పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని, మొదటి విడతలో 3,500 ఇళ్లు ఇచ్చామని, రెండో విడతలో మరో 2,500 ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.

​కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, తద్వారా పేదలకు సన్నబియ్యం అందించి కడుపునిండా అన్నం పెడుతున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలిగిందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సన్నధాన్యానికి బోనస్ ఇస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని అన్నారు.

​ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ప్రతి ఇంటికీ కనీసం రెండు నుంచి మూడు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతోందని ఎమ్మెల్యే అన్నారు. గత వరదల సమయంలో నష్టపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బాధితుల సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

​పదవులు ఉన్నా లేకపోయినా గత 25-30 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేస్తున్నామని, భవిష్యత్తులోనూ మీ ఆశీర్వాదంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇంచార్జి డీఆర్డీవో శిరీష, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా బేగం, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ చల్లగుల్ల నరసింహారావు, సత్తుపల్లి మునిసిపల్ కమిషనర్ నర్సింహా, మండల తహసీల్దార్ రవికుమార్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI