Bhadrachalam: రామాలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి మంత్రి పొంగులేటి!

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం. రూ.275 కోట్ల పనులపై సమీక్ష.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 23 Sept 2026 2:22 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: రామాలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి మంత్రి పొంగులేటి!

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనులు నిర్వహించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈరోజు భద్రాచలం చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

తదుపరి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి మంత్రి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్తర ద్వారం వద్ద ఉన్న దమ్మక్క విగ్రహం ప్రాంతం నుంచి పరిశీలన ప్రారంభించి, వివిధ నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుత దశ, పూర్తికి అవసరమైన సమయం, మానవ వనరులు, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే పనులు వేగం పుంజుకున్నాయని, నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో పూర్తి చేసేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. శ్రీరామనవమికి ముందుగానే ప్రధాన పనులు పూర్తయ్యేలా రివర్స్ ప్లానింగ్ రూపొందించుకోవాలని, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయం, మాడ వీధులు, అంతర్గత ప్రాకారం, బాహ్య ప్రాకారం తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను ముందుగానే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

లిఫ్ట్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రతి మూడు రోజులకు ఒక లిఫ్ట్‌ పనిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మానవ వనరులను పెంచుకోవాలని, సిబ్బంది కొరత వల్ల పనులు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిర్మాణ సామగ్రి అందుబాటులో లేక పనులకు అంతరాయం కలగకుండా సెంటరింగ్‌ తదితర సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట బూమ్‌ పంపులు, ఇతర యంత్ర పరికరాలను వినియోగించి పనుల సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు.

స్లాబ్‌ పనుల్లో ఒక దశ పూర్తయ్యే వరకు తదుపరి దశకు సంబంధించిన ఏర్పాట్లు ఆలస్యం కాకుండా సమాంతరంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పనుల మధ్య ఖాళీ సమయం తగ్గించి నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రతి పనికి వారంవారీ లక్ష్యాలను నిర్దేశించి, ఆ లక్ష్యాల మేరకు పురోగతి లేకపోతే కారణాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలన్నారు.

రాతి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన నిపుణులు, సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించి రోజువారీ లక్ష్యాలతో పనులు నిర్వహించాలని తెలిపారు. చివరి దశలో రాతి పనులు పెండింగ్‌లో ఉండకుండా ముందుగానే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గతంలో చేపట్టిన భారీ ఆలయ, జాతర ప్రాంతాల నిర్మాణ పనుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.

ఆలయ నిర్మాణంలో నాణ్యతతో పాటు శాస్త్రోక్తతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ఆలయ సంప్రదాయాలు, నిర్మాణ విధానాలకు అనుగుణంగా పనులు సాగుతున్నాయా అనే అంశాన్ని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు.

ఆలయ పరిసర రహదారుల అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.25 కోట్ల ప్రతిపాదనను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. నిర్ణీత గడువులు, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సమన్వయంతో పనిచేసి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem