Sathupally: రూ.200 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు అభినందనీయం!

Sathupally: సత్తుపల్లి మండలం నారాయణపురంలో రూ.200 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు హర్షణీయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంస.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 3 Oct 2026 4:55 PM IST
Sathupally
X

Sathupally: రూ.200 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు అభినందనీయం!

Sathupally: గిరిజన గ్రామీణ ప్రజలకు భరోసానిచ్చే క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు అభినందనీయం.. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో షిరిడీ సాయి జనమంగళ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మాణం.

రూ. 200 కోట్లకు పైగా నిధులతో క్యాన్సర్ నివారణ, వ్యాక్సినేషన్, ఉచిత సహాయక కార్యక్రమాలు షిరిడీ సాయి జనమంగళ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, సత్తుపల్లి మండలం చివరి గ్రామమైన నారాయణపురంలో రూ. 200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన క్యాన్సర్ ఆసుపత్రి, వ్యాక్సినేషన్, ఉచిత వైద్య సహాయక కార్యక్రమాల ఏర్పాటుపై రాష్ట్ర రెవెన్యూ , హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన స్వంత నియోజకవర్గంలో ఈ విధమైన బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ట్రస్ట్ నిర్వాహకులకు, టీమ్ సభ్యులకు ఆయన మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలు, హెచ్ పీవీ టీకాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, క్యాన్సర్ అనే మహమ్మారి ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని, అయితే గ్రామీణ ప్రాంత ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల, వైద్య ఖర్చులకు భయపడి ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన, గిరిజనేతర పేద కుటుంబాలకు ఆసుపత్రి ద్వారా వైద్యంతో పాటు వ్యాక్సినేషన్ ఒక్కొక్కరికి రూ. 7,000 విలువైన అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ట్రస్ట్ ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు రోడ్డు వసతులు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రతిపాదనలను రోజుల్లోగా తయారు చేసి తనకు పంపించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలతో వచ్చే ఈ వినతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పెద్ద మనసుతో భూమిని స్వల్ప ధరకు విక్రయించి సహకరించిన స్థానిక గ్రామస్తులను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వ పరంగా పూర్తి అండదండలు ఉంటాయని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, ఒకప్పుడు టీవీలలో, ఎక్కడో ఒకరికి వినే క్యాన్సర్ వ్యాధి, నేడు మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల ప్రతీ గ్రామంలోనూ కనిపిస్తూ సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు. క్యాన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనది కావడం వల్ల సామాన్యులు భరించలేకపోతున్నారని, ఈ క్రమంలో శ్రీ జనమంగళం ట్రస్ట్ వ్యాధి ముదిరిపోకుండా ప్రివెంటబుల్ క్యాన్సర్ డిసీజ్, ఆర్లీ డిటెక్షన్ (ముందస్తు వ్యాధి నిర్ధారణ) సేవలపై దృష్టి సారించడం విశేషమని తెలిపారు. గ్రామీణ పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేలా ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారని అన్నారు.

కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, ట్రస్ట్ నిర్వాహకులు రఘునాథరెడ్డి, సతీష్ రెడ్డి ల విజ్ఞప్తి మేరకు నారాయణపురం గ్రామస్తులు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఉదార హృదయంతో భూమిని అందించడం వల్లనే ఈ బృహత్తర కార్యక్రమం సాధ్యమైందని అన్నారు.

మారుమూల, గిరిజన ప్రాంతాలైన అశ్వారావుపేట, ములకలపల్లితో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో మేలు చేస్తుందన్నారు. జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం కారణంగా ప్రతి పది కుటుంబాల్లో ఒకరికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్న ఈ రోజుల్లో, ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు, ఉచిత వైద్య చికిత్సలు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

హైదరాబాద్, ముంబై, చెన్నై, వేలూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ప్రపంచ స్థాయి ఉచిత వైద్యం అందడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, ఈ ఆసుపత్రి విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, ఐటీడీఏ పీవో బి. రాహుల్, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI