Manuguru: మణుగూరులో కుమ్మర సంఘం వనసమారాధన, ఎమ్మెల్యే పాయం హాజరు
Manuguru: మణుగూరు మండలం తొగ్గూడెం వద్ద తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం కార్తీకమాస వనసమారాధనలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Manuguru: మణుగూరులో కుమ్మర సంఘం వనసమారాధన, ఎమ్మెల్యే పాయం హాజరు
మణుగూరు: మణుగూరు మండలం తొగ్గూడెం వద్ద తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, నిర్వాహకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వనసమారాధన కార్యక్రమంలో పాల్గొని సంఘ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీకమాస వనసమారాధన వంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర ఆత్మీయతను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో ఐక్యతాభావం మరింత బలపడుతుందని అన్నారు. ప్రజల మధ్య సత్సంబంధాలు, సోదరభావం పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన, ఆత్మీయ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం నాయకులు, సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




