Palwancha: పాల్వంచ అయ్యప్ప ఆలయంలో ఘనంగా మండల పూజా మహోత్సవాలు!
Palwancha: పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో ఆదివారం మండల పూజా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఎస్పీ రోహిత్ రాజ్ పూజలు చేయగా, 4 వేల మందికి అన్నదానం నిర్వహించారు.
Palwancha: పాల్వంచ అయ్యప్ప ఆలయంలో ఘనంగా మండల పూజా మహోత్సవాలు!
పాల్వంచ: పాల్వంచ పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు శనివారం రాత్రి, ఆదివారం ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి బొల్లోరిగూడెంలోని రామాలయం వద్ద తొలిసారిగా అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు జ్యోతులు వెలిగించుకొని, అయ్యప్పస్వామి విగ్రహాన్ని ఊరేగిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, బాణసంచా పేలుళ్లతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అనంతరం అర్ధరాత్రి దీక్ష స్వాములు హోమగుండంలో నడిచి అగ్నిపునీతులయ్యారు.
ఆదివారం దేవాలయ ప్రాంగణంలో అయ్యప్పస్వాములకు, భక్తులకు సుమారు 4 వేల మందికి అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మండల పూజా మహోత్సవాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ట్రస్ట్ సభ్యులు, కమిటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఇతర సభ్యులు ఎస్పీని శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం పూజారులు మాదవన్ నంబూద్రి, బృందావనం నర్సింహమూర్తి, ట్రస్ట్ సభ్యులు కొత్వాల శ్రీనివాసరావు, మేడిద సంతోష్ గౌడ్, కాల్వ భాస్కర్ రావు, బందెల శ్రీనివాస్, కనగాల రాంబాబు, మిరియాల కమలాకర్, మేరెడ్డి వేమారెడ్డి, పోలీస్ సీఐ సతీష్, ఎస్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




