Kothagudem: 2030 నాటికి బాల్యవివాహ రహిత జిల్లాగా భద్రాద్రిని తీర్చిదిద్దాలి: రాజేందర్!
Kothagudem: 2030 నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు.
Kothagudem: 2030 నాటికి బాల్యవివాహ రహిత జిల్లాగా భద్రాద్రిని తీర్చిదిద్దాలి: రాజేందర్!
పాల్వంచ: 2030 నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాల్యవివాహ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో పాల్వంచ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమవుతుందని అన్నారు. యువత, కౌమార బాలబాలికలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేస్తే 2030లోపే జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. బాల్యవివాహ నిరోధక చట్టం-2006లోని నిబంధనలు, శిక్షల గురించి వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించి బాల్యవివాహాలు జరిపితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లా సంక్షేమ అధికారి తార మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి వివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలల సమస్యల పరిష్కారానికి చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అంబేద్కర్ మాట్లాడుతూ బాల్యవివాహం ఒక సామాజిక దురాచారమని, దీనిని నిర్మూలించేందుకు గ్రామస్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిల్లా ఆరోగ్య అధికారి తుకారం రాథోడ్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు, గర్భధారణ వల్ల బాలికలకు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. తగిన పరిపక్వత లేకుండా గర్భధారణ జరిగితే తల్లి, శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు కొన్ని సందర్భాల్లో మాతా శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉందని వివరించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్ బాలికలు కౌమార దశలో ఎదురయ్యే మార్పులు, సమస్యలపై ఆందోళన చెందకుండా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా తగిన సలహాలు పొందాలని సూచించారు. విద్యాశాఖ సీఎంవో రామారావు పౌష్టికాహారం తీసుకుంటూ రక్తహీనత నివారణకు జాగ్రత్తలు పాటించి, విద్యలో రాణించాలని విద్యార్థినులకు సూచించారు.
లేబర్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ ఎయిడ్ సంస్థ బాల్యవివాహాల నిర్మూలనకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను అభినందించారు. ప్రచార రథం ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం మంచి ప్రయత్నమన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
షీ టీం ఎస్సై రమాదేవి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాలు, సెల్ఫోన్ వినియోగంపై నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భరోసా ఎస్సై అరుణ మాట్లాడుతూ చిన్న వయసులో ప్రేమ, ఆకర్షణలకు లోనై వివాహాల వైపు వెళ్లకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టి చదువుకోవాలని సూచించారు. సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న ముందస్తు, బలవంతపు వివాహాల వల్ల బాలికలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను వివరించారు.
చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సందీప్ మాట్లాడుతూ బాల్యవివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే 1098 లేదా పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 112కు సమాచారం అందించాలని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ తులసి బాల్యవివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, బాలికలు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
ఎయిడ్ సంస్థ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తమ సంస్థ బాల్యవివాహాల నిర్మూలన, బాలలపై లైంగిక దాడులు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా వంటి అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2030 నాటికి బాల్యవివాహ రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెంను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు, మెమొంటోలు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను సత్కరించారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు ఎయిడ్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ బాధ్యులు మోహన్, రవిచంద్ర, మాన్సింగ్, నాగేంద్రబాబు, జ్యోతి, మౌనిక, 1098 సభ్యులు, ఉమెన్ హబ్, డీసీపీయూ, భరోసా సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.




