Madhira: అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు డిప్యూటీ సీఎం భట్టి

Madhira: మధిర నియోజకవర్గంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Nov 2026 9:01 PM IST
Madhira
X

Madhira: అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు డిప్యూటీ సీఎం భట్టి

మధిర: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొన్నారు.

ఎర్రుపాలెం మండలం బంజరలో రెడ్డి బోయిన నాగమణి-కృష్ణయ్య, పెద్ద గోపవరంలో మోదుగు సీతారాజ్యం-గోపి, మధిర మండలం దెందుకూరులో ముప్పసాని కృష్ణవేణి-రాంబాబు దంపతుల ఇళ్లల్లో, మల్లారంలో యంద్రాతి అచ్చారావు, బోనకల్ మండలం రాయణపేటలో పర్సగానీ గోపి, చింతకాని మండలం పొద్దుటూరులో రెళ్ళ రాసి-తిరుపతి రావు, ముదిగొండ మండలం వనం వారి కిష్టాపురంలో పి.గంగా భవాని-శ్రీహరి, ముదిగొండలో కె.శ్రీలత-రాజేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో స్థానిక ప్రజలతో కలిసి ఉప ముఖ్యమంత్రి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్నారు. ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరడంతో ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటనలో ఆయా గ్రామాల ప్రజలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉప ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. నేడు గ్రామ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొని పండుగను లబ్ధిదారులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టడం ఒక వరమని, పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి అందిస్తోందని అన్నారు.

రాష్ట్రంలో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ కోర్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు.

ఇప్పటివరకు మంజూరైన ఇళ్లలో 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 1.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఎంత వేగంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తే అంతే వేగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని సొంతింటిలో గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు.

ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పారదర్శకంగా నేరుగా అందిస్తున్నామని తెలిపారు.

ప్రజాప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు.

పేదలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించ నున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ఈ పథకం ఉపయోగ పడుతుందని అన్నారు.

రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకం క్రింద 71 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించడంలో భాగంగా బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.90 వరకు ఉన్నప్పటికీ, రేషన్ దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో వ్యయం చేస్తోందని అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, అంతర్జాతీయ ప్రమాణాలతో 105 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతోందని అన్నారు.

రాష్ట్రంలో 41 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా ఆనందం, వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ ఇ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.