Madhira: మధిర సెంట్రలైజ్డ్ కిచెన్ రెండు నెలల ప్రస్థానం విజయవంతం!

Madhira: మధిర సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు 2 నెలలు 11 మండలాల్లోని 27,700 మంది విద్యార్థులకు నిత్యం పౌష్టికాహార బ్రేక్‌ఫాస్ట్.. డిప్యూటీ సీఎం భట్టి చొరవతో విజయవంతం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 29 Sept 2026 9:13 PM IST
Madhira
X

Madhira: మధిర సెంట్రలైజ్డ్ కిచెన్ రెండు నెలల ప్రస్థానం విజయవంతం!

ఖమ్మం/మధిర, సెప్టెంబర్ -29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్’ ప్రోగ్రామ్‌లో భాగంగా మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ విజయవంతంగా రెండు నెలల రన్‌ను పూర్తి చేసుకుంది. 2026 జూలై 27న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన ఈ బృహత్తర కార్యక్రమం, ఆయన నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో నిరంతరాయంగా కొనసాగుతోంది.

ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా మధిరతో పాటు సమీపంలోని 11 మండలాల్లో ఉన్న 575 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 27,700 మంది విద్యార్థులకు రోజువారీగా రుచికరమైన, శుభ్రమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో సమతుల్య మెనూ విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాలు అందించేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలో ప్రత్యేక అల్పాహార పట్టికను రూపొందించారు. వారంలో ప్రతిరోజూ వైవిధ్యమైన ఆహారంతో పాటు రోజు విడిచి రోజు వేడి పాలను అందిస్తున్నారు.

వారపు అల్పాహార మెనూ

ఒకటవ రోజు ఇడ్లీ – సాంబార్, రెండో రోజు పూరి – ఆలూ కుర్మా, మూడో రోజు దోశ – చట్నీ, నాల్గవ రోజు ఉప్మా – చట్నీ, ఐదో రోజు మిల్లెట్ ఇడ్లీ – సాంబార్, ఆరో రోజు బోండా – చట్నీ అందిస్తున్నారు.

అత్యాధునిక వంటశాల – వేగవంతమైన పంపిణీ

అధిక సంఖ్యలో విద్యార్థులకు నిర్ణీత సమయానికి వేడివేడిగా అల్పాహారం అందించేందుకు ఈ కిచెన్‌లో ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. గంటకు 5,400 ఇడ్లీలు, 3,600 పూరీలు, 2,000 దోశలు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వంటశాల కలిగి,

ఆధునిక పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేసిన అల్పాహారాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా సకాలంలో పాఠశాలలు, కళాశాలలకు చేరవేస్తున్నారు.

ప్రభుత్వ వ్యయం వివరాలు

విద్యార్థుల స్థాయిని బట్టి ప్రభుత్వం అల్పాహారానికి అయ్యే వ్యయాన్ని భరిస్తోంది. ప్రాథమిక పాఠశాల (1–5 తరగతులు): రూ. 11.50 (ప్రతి విద్యార్థికి), ఉన్నత పాఠశాల (6–10 తరగతులు): రూ. 13.50 (ప్రతి విద్యార్థికి), జూనియర్ కళాశాల: రూ. 13.50 (ప్రతి విద్యార్థికి), పాలు (రోజు విడిచి రోజు): విద్యార్థికి రూ. 1.08 చొప్పున కేటాయింపు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు హరే కృష్ణ మూవ్‌మెంట్ కృతజ్ఞతలు

ఉదయాన్నే పోషకాహారం అందడం వల్ల విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతుల్లో కూర్చోవాల్సిన అవసరం తప్పిందని, దీనివల్ల వారి ఏకాగ్రతతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం మెరుగవుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ వంటశాల నిర్మాణానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆర్థిక సహాయం అందించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.