Kothagudem: పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన సదస్సు!
Kothagudem: కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై ఓపెన్ హౌస్ నిర్వహించారు. షీ టీమ్స్, క్లూస్ టీమ్ విధులను అధికారులు వివరించారు.
Kothagudem: పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన సదస్సు!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన కల్పించేందుకు గురువారం ఆన్‌లైన్ ఓపెన్ హౌస్, ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల విధులు, వాటి ప్రాధాన్యతను అధికారులు విద్యార్థులకు వివరించారు. షీ టీమ్స్ ద్వారా మహిళలు, బాలికల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, వేధింపుల నివారణ, ఫిర్యాదుల స్వీకరణ, బాధితులకు అందించే సహాయంపై అవగాహన కల్పించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం మానవ అక్రమ రవాణా నిరోధానికి చేపట్టే చర్యలను వివరించారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలు, చిన్నారులకు అందించే సహాయం, కౌన్సెలింగ్ సేవలను తెలియజేశారు.
అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్ విధులు, ఫింగర్ ప్రింట్ విభాగం, క్లూస్ టీమ్ నేర పరిశోధనలో ఆధారాల సేకరణకు అనుసరించే శాస్త్రీయ పద్ధతుల గురించి వివరించారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ ఉపయోగించే పరికరాలు, ప్రమాదాల నివారణకు తీసుకునే జాగ్రత్తలు, డాగ్ స్క్వాడ్ సేవలు, కమ్యూనికేషన్ విభాగం పనితీరును విద్యార్థులకు పరిచయం చేశారు.
ఓపెన్ హౌస్ ద్వారా పోలీస్ శాఖలో ఉపయోగించే పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా చర్యలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు మహిళలు, బాలల భద్రతకు సంబంధించిన అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు శ్రీనివాస్, రాము, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, యాసీన్, ఎస్సైలు శ్రీనివాస్, అరుణ, రమాదేవి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.




