Kothagudem: పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్య: కార్మికుల ఉక్కిరిబిక్కిరి!
Kothagudem: కొత్తగూడెం పద్మావతి గనిలో గత ఏడాదిన్నరగా వెంటిలేషన్ సమస్యతో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ఏఐటీయూసీ నాయకులు గని మేనేజర్ రవికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు.
Kothagudem: పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్య: కార్మికుల ఉక్కిరిబిక్కిరి!
కొత్తగూడెం: పద్మావతి గనిలో వెంటిలేషన్ సమస్యతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించి మెరుగైన పని వాతావరణం కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గని మేనేజర్ రవికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు.
గత ఏడాదిన్నరగా గనిలో సరైన గాలి ప్రసరణ లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. పిట్ బాటమ్ నుంచి ఎస్‌ఆర్‌తో పాటు పని ప్రదేశాలకు వెళ్లే మార్గాల్లో రిటర్న్ గాలిలోనే ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు చెమటతో తడిసిపోయి తీవ్ర అలసటకు గురవుతున్నారని, పని ప్రదేశాల్లోనూ గాలి ప్రసరణ సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వెంటిలేషన్, సేఫ్టీ అధికారులతో చర్చించి, పని ప్రదేశాలను పరిశీలించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వెంటిలేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అదేవిధంగా కార్మికులకు సేఫ్టీ బూట్లు, సాక్సులు, చేతి గ్లౌజులు అందించాలని, 4, 6 ఫీట్ కోల్ బర్మాలు, 43 ఎంఎం డ్రిల్ బిట్లు సరిపడా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. లైన్మెన్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లకు అవసరమైన పని ముట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. కేజీకి అదనంగా స్పేర్ ఏర్పాటు చేయడంతో పాటు రేడియం స్టిక్కర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేయకూడదని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సెంట్రల్ కార్యదర్శి జి. వీరస్వామి, ఫిట్ కార్యదర్శి భూక్య రమేష్, ఎస్. నాగేశ్వరరావు తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.




