Kothagudem: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కొత్తగూడెం ఎస్సై!

Kothagudem: హైదరాబాద్‌లో గణేష్ బందోబస్తు విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై కొత్తగూడెం 2 టౌన్ ఎస్సై కున్సోత్ వెంకన్న మృతి చెందారు. ఎస్పీ రోహిత్ రాజు సంతాపం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Updated on: 24 Sept 2026 12:44 PM IST
Kothagudem
X

Kothagudem: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కొత్తగూడెం ఎస్సై!

Kothagudem: విధి నిర్వహణలో భాగంగా వినాయక చవితి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కుంశోత్ వెంకన్న (57) మృతి పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు.

బుధవారం నాడు తెల్లవారుజామున సుమారు 02:00 గంటల సమయంలో హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో వినాయక చవితి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ వెంకన్నను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత కారణంగా బుధవారం సాయంత్రం 17:40 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఎస్‌ఐ కున్సోత్ వెంకన్న మృతి పోలీస్ శాఖకు తీరని లోటని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కల్పించాలని, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.వెంకన్న కుటుంబానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.