Kothagudem: సఫాయి బస్తీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సఫాయి బస్తీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, 49 వాహనాలు, 87 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
Kothagudem: సఫాయి బస్తీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సఫాయి బస్తి ప్రాంతంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు.
కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, రెండు త్రిచక్ర వాహనాలను గుర్తించారు. మొత్తం 49 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. అదేవిధంగా 87 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ స్థానికులకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించేందుకు సహకరించాలని కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, కదలికలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని, మతసామరస్యాన్ని కాపాడాలని డీఎస్పీ కోరారు. ఈ ఆపరేషన్‌లో సీఐలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌తో పాటు సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




