Kothagudem: రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి కొత్తగూడెంలో మహిళా సమాఖ్య ధర్నా

Kothagudem: వ్యాపార బకాయిలు రూ. 43 లక్షలు చెల్లించి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కొత్తగూడెంలో మహిళా సమాఖ్య నాయకురాలు మున్నా లక్ష్మి కుమారి డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 30 Oct 2026 6:33 PM IST
Kothagudem
X

Kothagudem: రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి కొత్తగూడెంలో మహిళా సమాఖ్య ధర్నా

కొత్తగూడెం: వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రూ.43 లక్షల బకాయిలను వెంటనే చెల్లించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ (మహిళా సమాఖ్య) ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ పసల అరుణకు సంఘీభావం తెలిపిన మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి మాట్లాడుతూ.. విద్యానగర్ కాలనీకి చెందిన అరుణ భర్త ప్రసాద్ 18 ఏళ్లుగా నిర్వహించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

2008లో బీ-లైన్ వ్యాపారంలో రూ.15 లక్షల పెట్టుబడితో పాటు లాభాల్లో 30 శాతం వాటా ఇస్తామని నమ్మించారని, ప్రసాద్ అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బకాయిలు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించి, ఫైనాన్స్‌కు సంబంధించిన రికార్డులను తీసుకెళ్లారని ఆరోపించారు.

భర్త వైద్య ఖర్చుల కోసం తమకు రావాల్సిన సొమ్మును అడిగినప్పుడు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వ్యాపార లెక్కలను నిష్పక్షపాతంగా పరిశీలించి బాధిత కుటుంబానికి రావాల్సిన రూ.43 లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బెదిరింపుల ఆరోపణలపై విచారణ జరిపి బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరారు.

అరుణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మున్నా లక్ష్మి కుమారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు మామిడాల ధనలక్ష్మి, షాహీన్, దార్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM